రావాల్సింది రూ.69 కోట్లు..వచ్చింది రూ.45 కోట్లే..!

అరకొరగా పెన్షన్‌ సొమ్ము విడుదల
యూనియన్‌ బ్యాంకుకు ఆర్‌బిఐ నుంచి విడుదల కాని సొమ్ము
జిల్లావ్యాప్తంగా మొదటి రోజు 30 శాతం మాత్రమే పంపిణీ పూర్తి
ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయాల వద్ద పింఛనుదారుల అవస్థలు
ప్రజాశక్తి – భీమవరం
ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీ రాజకీయం పులుముకుంది. అధికార పార్టీ వైసిపి, ప్రతిపక్ష పార్టీలు పెన్షన్ల పంపిణీని పూర్తి రాజకీయంగా మార్చేశారు. దీనికితోడు ఎన్నికల సంఘం ఆదేశాలు వెరసి పింఛన్‌దారులకు తిప్పలు తప్పలేదు. ప్రతినెలా ఒకటో తేదీన ఠంచన్‌గా సొమ్ము అందుకునే పింఛన్‌దారులు మూడు రోజులైనా చేతికి అందక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పింఛన్ల పంపిణీ పని నుంచి వాలంటీర్లను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. నడవలేని వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దనే పెన్షన్లు అందించాలని, మిగిలిన వారికి సచివాలయాల వద్ద పెన్షన్లు అందించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆపై ఈ నెల మూడో తేదీ నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారని ప్రకటించారు. జిల్లాలో వృద్ధాప్య, వికలాంగులు, వితంతు పెన్షన్లతోపాటు 23 రకాల పెన్షన్లకు సంబంధించి రెండు లక్షల 34 వేల 884 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతినెలా జిల్లావ్యాప్తంగా రూ.68.92 కోట్ల సొమ్ము లబ్ధిదారులకు పెన్షన్‌ రూపంలో అందించాల్సి ఉంది. అయితే కేవలం రూ.45.37 కోట్లు మాత్రమే సొమ్ము విడుదలైంది. మిగిలిన రూ.24 కోట్లు విడుదల కావాల్సి ఉంది. బుధవారం మధ్యాహ్నం నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి జిల్లాలో ఉన్న బ్యాంకులకు పెన్షన్‌ సొమ్ము జమైంది. అయితే పెన్షన్‌దారులు మాత్రం ఉదయమే సచివాలయాల వద్ద పెన్షన్‌ సొమ్ము కోసం బారులుదీరారు. సొమ్ము మాత్రం మధ్యాహ్నం నుంచి బ్యాంకులకు రావడంతో సచివాలయ సిబ్బంది బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. దీంతో వృద్ధులు సచివాల యాల వద్ద పడిగాపులు పడ్డారు. అదే క్రమంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పెన్షన్‌దా రులు తల్లడిల్లారు. జిల్లావ్యాప్తంగా రెండు లక్షల 34,884 మంది పెన్షన్‌ లబ్ధిదారులు ఉంటే బుధ వారం రాత్రికి కేవలం 68,103 మందికి రూ.20 కోట్లు మాత్రమే సొమ్ము అందించారు. జిల్లావ్యాప్త ంగా 30 శాతం మాత్రమే పంపిణీ పూర్తయ్యింది.యూనియన్‌ బ్యాంకులకు జమకాని సొమ్ము జిల్లాలో యూనియన్‌ బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి పెన్షన్‌ సొమ్ము జమ కాలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎస్‌బిఐకు సొమ్ము జమ కాలేదు. తర్వాత ఆర్‌బిఐ నుంచి సొమ్ము జమైంది. యూనియన్‌ బ్యాంక్‌కైతే పెన్షన్‌ సొమ్ము ఆర్‌బిఐ నుంచి జమ కాలేదు. మిగిలిన అన్ని బ్యాంకులకూ పెన్షన్‌ సొమ్ము జమైంది. పెన్షన్‌ సొమ్ముకు సంబం ధించి యూనియన్‌ బ్యాంక్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ఆర్‌బిఐ నుంచి అను మతులు రాకపోవడంతో సొమ్ము జమ కాలే దని తెలిసింది. సాంకేతిక లోపం కారణంగా ఇబ్బందులు ఏర్పడి ఉండొచ్చని ఒక అధికారి తెలిపారు.నేడు పూర్తిస్థాయిలో పెన్షన్ల పంపిణీఎంఎస్‌ఎస్‌.వేణుగోపాల్‌, డిఆర్‌డిఎ, పీడీ ప్రతి నెలా చివర్లో పెన్షన్‌ సొమ్మును డ్రా చేసి ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి పంపిణీ జరిగేది. అయితే మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియడంతో బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడ్డాయి. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఆర్‌బిఐ నుంచి బ్యాంకులకు పెన్షన్‌ సొమ్ము జమైంది. సచివాలయాల ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఇప్పటి వరకు 68,103 మంది పెన్షన్‌దారులకు రూ.20 కోట్లు పంపిణీ చేశాం. ఆర్‌బిఐ నుంచి ఆయా బ్యాంకులకు రూ.45.37 కోట్లు జమైంది. మిగిలిన రూ.23.55 కోట్లు గురువారం జమవుతాయి. పూర్తిస్థాయిలో పెన్షన్ల పంపిణీకి అన్నివిధాలుగా చర్యలు తీసుకున్నాం.

➡️