ప్రజాశక్తి – పెంటపాడు
కూటమి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్ కోరారు. ప్రజా చైతన్య జిల్లాస్థాయి సైకిల్ యాత్ర బుధవారం పెంటపాడు మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పెంటపాడులో జరిగిన సభకు సిపిఎం నాయకులు చిర్ల పుల్లారెడ్డి అధ్యక్షత వహించారు. గోపాలన్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ కాలనీల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని, వారి సమస్యల పరిష్కారానికి ఈ నెల 17న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నామని తెలిపారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతకాయల బాబూరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ అడుగు జాడల్లోనే కూటమి ప్రభుత్వం నడుస్తోందని, దానికి స్మార్ట్ మీటర్ల బిగింపేనని అన్నారు. తక్షణం స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపి విద్యుత్ భారాలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిరపరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి, బంకురి నాగేశ్వరరావు, అల్లు సుబ్బారావు, బర్ల బాలాజీ, పెనగంటి దుర్గా, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: పేద కుటుంబాలు నివాసముంటున్న కాలనీల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్ అన్నారు. సిపిఎం ప్రజా చైతన్య సైకిల్ యాత్ర అలంపురం, ఆరుగొలను, ఇటుకలగుంట మీదుగా మంగళవారం రాత్రి తాడేపల్లిగూడెం ఎల్.అగ్రహారం వద్ద ఉన్న టిడ్కో గృహా సముదాయాల వద్దకు చేరుకుంది. తాడేపల్లిగూడెం టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీ, కెఎస్‌ఎన్ కాలనీ, యాగర్లపల్లి కాలనీ మీదుగా సైకిల్ యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో యాత్ర బృందం పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు, చింతకాయల బాబూరావు, పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, పట్టణ నాయకులు జవ్వాది శ్రీను, శిద్దిరెడ్డి శేషుబాబు, పోతు శ్రీను, యడవల్లి వెంకట దుర్గారావు, బంకురు యశోద పాల్గొన్నారు. గణపవరం: ప్రభుత్వ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం ప్రజాచైతన్య జిల్లాస్థాయి సైకిల్ యాత్ర బుధవారం మండలంలోని పిప్పర, కేశవరం, తాళ్లపాలెం, మొయ్యేరు, కోమట్లపాలెం గ్రామాల్లోని మీదుగా సాగింది. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ కాలనీల్లో నివాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొయ్యేరు కాలనీలో ప్రజలు యాత్ర నేతలతో మాట్లాడుతూ ఇళ్ల స్థలాలిచ్చిన ప్రభుత్వం ఇంటి నిర్మాణం చేసుకోవడం కోసం ఇచ్చిన సొమ్ము చాలక అప్పులు చేశామని, వాటి వడ్డీలు చెల్లించలేకపోతున్నామని తెలిపారు. కాలనీల్లో రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీలు ఏర్పాటు చేయకపోవడంతో నానావస్థలు పడుతున్నామని వాపోయారు. దీనిపై గోపాలన్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఈ నెల 17న కలక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాలో పెద్దసంఖ్యలో పాల్గొనాలన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సిపిఎం అండగా ఉంటుందన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు రుణం అందించాలని, అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఇచ్చిన రుణాలు రద్దు చేయాలని కోరారు. అత్తిలి: సైకిల్ యాత్ర బుధవారం ఉరదాళ్లపాలెం వద్ద మండలంలోకి ప్రవేశించింది. అనంతరం యాత్ర అత్తిలి చేరుకుంది. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్‌లో జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతకాయలు బాబూరావు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో లబ్ధిదారులతో సెంటున్నర స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఫలితంగా అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఆయా ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఓపక్క అప్పులు తీర్చలేక, మరోపక్క సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో నేతలు కేతా గోపాలన్, కె.క్రాంతిబాబు, గొర్ల రామకృష్ణ, బి.విజరు, కె.ధర్మేంద్ర, రాంబాబు, సిహెచ్.నాగరాజు పాల్గొన్నారు. అత్తిలిలో వైఎస్‌ఆర్ కాలనీకి రేషన్ వ్యాన్, తాగునీరు, వీధి దీపాల సమస్య ఉన్నట్లు బృందం దృష్టికి జనం తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్ పంచాయతీ అధికారికి ఫోన్ చేసి ఆయా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పెనుమంట్ర: కాలనీల్లోని ప్రజలకు కూటమి ప్రభుత్వం వెంటనే కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్ కోరారు. బుధవారం సాయంత్రం మండలంలోని బ్రాహ్మణచెర్వు సెంటర్‌కు సైకిల్ యాత్ర చేరింది. ఈ సందర్భంగా గోపాలన్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడారు. సిపిఎం మండల కార్యదర్శి కోడి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని, బ్రాహ్మణచెరువు మెయిన్ రోడ్డు పక్కన ఉన్న కాలనీలో రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించి తాగునీరు, వీధి దీపాలు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల హరేరామ్, కూసంపూడి సుబ్బరాజు, తెన్నేటి ఆంజనేయులు, గంటి ఆంజనేయులు, కొప్పిశెట్టి పరమేశు, బొంతు శ్రీను, మాదాసు లక్ష్మణరావు, ఉండ్రాజవరం భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం యాత్రం పొలమూరు మీదుగా వీరవాసరం మండలం కొణితివాడ చేరుకుంది.