విద్యాసంస్థల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌

శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ బివి.రాజు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విష్ణు స్కూల్‌ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు గురువారం ఘనంగా జరిగాయి. ఫౌండేషన్‌ ఛైౖర్మన్‌ కెవి విష్ణు రాజు హాజరై సంబరాలను తిలకించారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యకలాపాలతో పాటు సంక్రాంతిని ప్రతిబింబించే రంగవల్లులు, గొబ్బెమ్మలు, కోలాటం, భోగిపళ్లు, వివిధ కళారూపకాలు, హరిదాసులు, కొమ్ముదాసులు, సోదమ్మ, పిట్టలదొర వేషధారణలు ఆకట్టుకున్నాయి. విష్ణు విద్యా సంస్థల ఛైర్మన్‌ కెవి.విష్ణురాజు మాట్లాడుతూ సంప్రదాయ బద్ధమైన ఏ అంశమైనా రాబోయే తరాలకు ఉన్నతమైన ఆరోగ్యాన్ని, మంచి ఆలోచనా శక్తిని అందించే ఉద్దేశంతో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల జనరల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌ జె.ప్రసాద్‌రాజు, డైరెక్టర్‌ ఫర్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ అండ్‌ అడ్మిన్‌ పి.శ్రీనివాస్‌రాజు, డిజిఎం.రమేష్‌రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. సర్‌ సివి రామన్‌ స్కూల్లో సంక్రాంతి సంబరాలుసంక్రాంతి సంబరాలు మన సంస్కృతికి చిహ్నాలని ప్రాచీన కళా వైభవాన్ని తెలుపుతూ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని ఆర్‌టిసి డిపో మేనేజర్‌ పిఎన్‌ఎస్‌.సత్యనారాయణ మూర్తి అన్నారు. గురువారం శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో సర్‌ సివి రామన్‌ స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. డిపో మేనేజర్‌ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ స్కూళ్లలో సంక్రాంతి సంబరాలను నిర్వహించాడం గొప్ప విశేషమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను వివిధ పాఠశాలల్లో వారం రోజులుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్‌ ప్రిన్సిపల్‌ పెండ్యాల సరిత, పోస్టల్‌ శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మొగల్తూరు : పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని విప్‌, ఎంఎల్‌ఎ బొమ్మిడి నాయకర్‌ అన్నారు. ప్రతిభ ఇంగ్లీష్‌ మీడియం ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు గురువారం నిర్వహించారు. బొమ్మల కొలువు, ఫుడ్‌ ఫెస్టివల్‌, చిన్నారులకు భోగి పండ్లు పోయడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలతో సంబరాల్లో పాల్గొన్నారు. విద్యార్థుల హరిదాసు, బసవన్న తదితర వేషధారణలు ఆకట్టుకున్నాయి. విద్యార్థినులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఆయా పోటీలను నాయకర్‌ తిలకించారు. విద్యార్థుల వేషధారణలు ఆకట్టుకున్నాయని ఎంఎల్‌ఎ తెలిపారు. బాగా చదువుకుని పాఠశాలకు, ఊరికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమాలను ప్రిన్సిపల్‌ మాలే సుష్మా, అడ్డాల కోదండ సాయికుమార్‌, ముక్కు నాగమణి, పులకండం అనంతలక్ష్మి, బెల్లంకొండ సత్యనారాయణ, పద్మనాభుని నగేష్‌ పర్యవేక్షించారు. పాఠశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.ఆకివీడు : స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర హైస్కూల్లో గురువారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు ముగ్గులు వేసి, బొమ్మల కొలువుల ఆటలు పాటలతో సంబరంగా గడిపారు. విద్యార్థుల గంగిరెద్దు, బుడబుక్కలోడు, పిట్టలదొర, హరిదాసు వంటి వేషధారణలు ఆకట్టుకున్నారు. చివరిగా భోగిమంటలతో సంబరాలు పూర్తి చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గణపవరం:గణపవరం డిగ్రీ కాలేజీలో గురువారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజీ ప్రిన్సిపల్‌ పి.నిర్మలాకుమారి మాట్లాడుతూ సకల సౌభాగ్యాలను కలుగజేసే రైతన్నను మర్చిపోకూడదని తెలిపారు. రైతులు కష్టాన్ని గుర్తు పెట్టుకుని వారిని అన్నిరకాలుగా ఆదరించాలన్నారు. సంబరాల్లో భాగంగా భోగి మంటను ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ రెండో పిఒ భాస్కరరావు భోగి మంటల విశిష్టతను విద్యార్థులకు వివరించారు.అనంతరం జరిగిన ఆటలు పోటీల్లో గెలుపొందిన వారికి ప్రిన్సిపల్‌ నిర్మలాకుమారి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు సిహెచ్‌ చైతన్య, టి.అక్కిరాజు, కె.స్వరూపరాణి, కెవి.గణేష్‌కుమార్‌, పి.భాస్కరరావు పాల్గొన్నారు.కాళ్ల : మన సంస్కృతీ, సంప్రదాయాలను ఎప్పటికీ మరువరాదని హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు కె.నిర్మలాదేవి అన్నారు. కోపల్లె హైస్కూల్లో ఉన్నత పాఠశాల, ఐక్య నేషనల్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల బాలికలకు సాంప్రదాయ దుస్తుల పోటీలు, బాలికలకు ముగ్గుల పోటీలు, ఫ్యాన్సీడ్రెస్‌ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహించారు. ఐక్య నేషనల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్‌ ఆచారి, కన్వీనర్‌ స్వామి, జివి డాక్టర్‌ కృష్ణంరాజు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫస్ట్‌ అసిస్టెంట్‌ కె.సుబ్బరాజు, స్టాఫ్‌ సెక్రటరీ మాణిక్యాలరావు, సిబ్బంది పాల్గొన్నారు.ఆచంట : మరుగున పడుతున్న ఆచారాలను, వేడుకలను జాగృతి పర్చడంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎంఇఒ ఎ.ఉషారాణి అన్నారు. గురువారం ఆచంట జెడ్‌పి ఉన్నత పాఠశాల, కొడమంచిలి, వల్లూరు, పెనుమంచిలి, ఆచంట వేమవరం, కరుగోరుమిల్లి, భీమలాపురం, పెదమల్లం, కోడేరు, కందరవల్లి, అయోధ్యలంక గ్రామాల్లో విద్యార్థులు భోగి మంటలు వేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వేషధారణలు అందర్నీ ఆకట్టుకున్నాయి. తహశీల్దార్‌ కనకరాజు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి కనుమరుగు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ పూర్ణ బాబ్జి, ఎంఇఒ-2 పి.రాజేంద్రప్రసాద్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.నరసాపురం : సంస్కృతీ, సంప్రదాయాలను నేటితరానికి తెలియజేయాలని తహశీల్దార్‌ టి.రాజరాజేశ్వరి అన్నారు. యర్రంశెట్టివారి పాలెం జెడ్‌పి హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు స్కూల్‌ ప్రాంగణంలో రంగురంగుల ముత్యాల ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు తహశీల్దార్‌ రాజరాజేశ్వరి, మాజీ ఎఎంసి వైస్‌ ఛైర్మన్‌ యర్రంశెట్టి బాబులు, స్కూల్‌ ఛైర్మన్‌ మురళీకృష్ణ బహుమతులు అందించారు. అనంతరం యర్రంశెట్టి బాబును తహశీల్దార్‌ సత్కరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కోళ్లపర్తి శ్రీనివాసరావు, సుబ్బారావు, అరుణ, ఉపసర్పంచి వాసు, వైఎస్‌ హరి పాల్గొన్నారు.నరసాపురం : పట్టణంలోని బిజిబిఎస్‌ మహిళా కళాశాలలో వాసవీ క్లబ్‌ ఆధ్వర్వంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌, వాసవీ క్లబ్‌ ప్రెసిడెంట్‌ నూలి శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ పోటీల్లో 100 మంది విద్యార్థులు పాల్గొని ముగ్గులు వేశారు. అనంతరం విజేతలకు బహుమతులందించారు. కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి కంచర్ల బాబ్జి, కోశాధికారి కోట్ల బాలకృష్ణ, ప్రిన్సిపల్‌ కె.మధుశాలిని పాల్గొన్నారు. తణుకు : సంస్కృతీ, సాంప్రదాయాలను తెలిజేసే పండుగ సంక్రాంతి అని ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాల కరస్పాండెంట్‌ చిట్టూరి సత్యఉషారాణి అన్నారు. ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తొలుత కళాశాల కరస్పాండెంట్‌ చిట్టూరి సత్యఉషారాణి, కళాశాల ప్రిన్సిపల్‌ యు.లక్ష్మీసుందరీబారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యఉషారాణి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భోగిపళ్లు, భోగిమంటలు, గొబ్బిళ్లు, కోలాటం, విద్యార్థినుల సంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో వివేకానంద స్కూల్‌ కరస్పాండెంట్‌ చిట్టూరి రీనాసాయి, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బిహెచ్‌ హిమబిందు, అధ్యాపక, అధ్యాపకేతర పాల్గొన్నారు. వివేకానంద గ్లోబల్‌ స్కూల్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. పిల్లలు, గోదాదేవి, హరిదాసులు, సోదమ్మ వేషధారణలో అలరించారు. కార్యక్రమంలో స్కూల్‌ కరస్పాండెంట్‌ చిట్టూరి సత్యఉషారాణి, స్కూల్‌ సెక్రటరీ చిట్టూరి రీనాసాయి, స్కూల్‌ హెచ్‌ఎం రవీంద్రనాధ్‌ పాల్గొన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలు నేటి యువతరానికి అందించాలని మాజీ వీవర్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వావిలాల సరళాదేవి అన్నారు. ఇంపల్స్‌ కాలేజీలో సరళాదేవి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడారు. ఈ సందర్భంగా సాంప్రదాయ వస్త్రధారణ, వంటలు, ముగ్గుల పోటీలు, గాలి పటాలు, మోహందీ, చిన్నారుల చే విచిత్ర వేషధారణ వంటి పోటీలు విద్యార్థులతో నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం కాలేజీ ప్రిన్సిపల్‌ కెఎన్‌వి రామ్‌కుమార్‌ దంపతులను సత్కరించారు. పెనుమంట్ర : మండలంలోని పెనుమంట్ర విజయ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌, మార్టేరు వివేకానంద స్కూల్‌, వెలగలేరు విద్యార్థి, సంఘమిత్ర ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో గురువారం సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. టీచర్స్‌ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అక్కట్టుకొంది.

➡️