ఆర్‌టిసి కార్గోలో కుంభకోణం

నరసాపురం పాయింట్‌లో అవినీతికి పాల్పడిన ఉద్యోగి
ఆడిట్‌లో గుర్తించిన అధికారులు
ప్రజాశక్తి – నరసాపురం
నరసాపురం ఆర్‌టిసి డిపోలోని కార్గో పాయింట్‌లో ఉద్యోగి అవినీతి పాల్పడ్డారని పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఎపిఎస్‌ఆర్‌టిసి కార్గో పాయింట్‌ ద్వారా వస్తువులు డోర్‌ డెలివరీ సేవలు అందిస్తున్నాయి. ఎంపిక చేసిన పట్టణాల్లో, నగరాల్లో పది కిలోమీటర్ల పరిధిలో ఆర్‌టిసి డోర్‌ డెలివరీ సౌకర్యం కల్పిస్తుంది. డిపోలో 2019 నుంచి కార్గో సేవలందిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, తణుకు, పాలకొల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం కార్గో సేవలందిస్తున్నాయి. డోర్‌ డెలివరీ ఛార్జీలు వస్తువు దూరం, బరువు ఆధారంగా నిర్ణయిస్తారు. 2019కి మందుకు కండక్టర్‌ పనిచేసిన వ్యక్తి 2019 నుంచి కార్గోలో డిఎంఇగా పని చేస్తున్నారు. నరసాపురం నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాదు నుంచి నరసాపురానికి నెలకు బస్సు మూడు నుంచి నాలుగు సార్లు తిరుగుతుంది. వెళ్లిన ప్రతిసారి రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఆర్‌టిసి ఆదాయం వస్తుంది. వచ్చిన నగదు ఆరోజు లేదా మరుసటి రోజు జమ చేయాలి. కాని ఆ ఉద్యోగి అలా చేయలేదు. ప్రతి ఏడాది ఆడిట్‌ జరుగుతుంది. ఈ ఏడాది మార్చి చివర్లో జరిగిన ఆడిట్‌లో ఆ ఉద్యోగి బాగోతం బయటపడింది. పది రోజులుగా ఆడిట్‌ జరుగుతుందని, ఇంకా నాలుగైదు రోజులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విజయవాడ ఆర్‌టిసి కార్యాలయం నుంచి ఆడిట్‌ అధికారి విచారణ చేపడుతున్నారు. అప్రమత్తమైన ఆర్‌టిసి అధికారులు ఆ ఉద్యోగిని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఇప్పటికే అతని వద్ద నుంచి కొంతమొత్తం నగదు రికవరీ చేసినట్లు సమాచారం. ఆడిట్‌ అధికారులు 2019 నుంచి పలు రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఈ కుంభకోణంలో ఇంకెవారిదైనా పాత్ర ఉందోమోననే కోణంలో విచారణ చేస్తున్నారు.కార్గో సేవలో పెద్ద మొత్తంలో రూ.లక్షల్లో అవినీతి జరిగిందని, వందల లీటర్ల డీజిల్‌ కూడా పక్కదారి పట్టిందని ఆర్‌టిసి ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. సొమ్ము ప్రభుత్వ ఖాతాలో జమ కాకపోవడం, రికార్డ్స్‌ సక్రమంగా మెయింటైన్‌ చేయకపోవడం, సరైన సమయంలో నగదు జమ కాకపోవడంపై అధికారులు ఎందుకు ప్రశ్నించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

➡️