పని భారం తగ్గించాలని కార్యదర్శుల వినతి

ప్రజాశక్తి – వీరవాసరం

పంచాయతీ కార్యదర్శులపై పని భారం తగ్గించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యాన గురువారం ఇన్‌ఛార్జి ఎంపిడిఒ అప్పారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిపాలనలో అత్యవసరమైన 26 రకాల రోజువారీ విధులు, సచివాలయం ద్వారా ఇస్తున్న వివిధ రకాల సర్వేల వల్ల తమపై పని భారం ఎక్కువగా ఉంటుందన్నారు. సెలవు రోజుల్లో కూడా గ్రామ పంచాయతీలో అత్యవసర పనులకు హాజరు కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేల భారం బాగా ఎక్కువగా ఉందన్నారు. పని భారం తగ్గించాలని, సెలవు రోజుల్లో అత్యవసర పనులకు మినహా మిగిలిన పనుల్లో కార్యదర్శులను మినహాయించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు చిట్టిబాబు, నేతలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️