అమరావతికి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌

మాజీ మంత్రి జోగయ్య వ్యాఖ్యలు విచారకరం

రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు

ప్రజాశక్తి – యలమంచిలి

పిపిఎ పద్ధతి ద్వారా నిర్మితమవుతున్న రాష్ట్ర రాజధాని అమరావతి ద్వారా భవిష్యత్తులో రాష్ట్రానికి తిరిగి లక్ష కోట్ల రూపాయలకుపైగా ఆదాయం వస్తుందని, ఐతే రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.50 వేల కోట్లు కేటాయింపుపై మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య చేసిన విమర్శలు విచారకరమని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం మండలంలోని మేడపాడు గ్రామంలో జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులు రూ.82 లక్షలు, నేరేడుమిల్లి గ్రామంలో రూ.42 లక్షల నిధులతో చేపట్టబోయే పనులకు సంబంధించి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పరిపాలనా దక్షత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, బిజెపి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నడూ జరగని అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, గత వైసిపి ప్రభుత్వం మూడు రాజదానులు అని చెప్పి ఒక్క రాజదానికి ఒక్క ఇటుక కూడా పేర్చిన దాఖలాలు లేకపోగా, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్నారు. ఆ సమయంలో ఎటువంటి విమర్శలు చేయని జోగయ్య లాంటి సీనియర్‌ నాయకులు ప్రస్తుత కూటమి సర్కార్‌పై విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని, వైసిపి నాయకుల వలె జోగయ్య కూడా మాట్లాడడం తగదని, ఆయన అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడేలా ఉండాలే గాని రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించే విధంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మామిడిశెట్టి పెద్దిరాజు, బోనం నాని, రుద్రరాజు సత్యనారాయణ రాజు, ముచ్చర్ల శ్రీనివాస్‌, కొడవటి సత్యవరబాబు, ఉన్నమట్ల ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.

➡️