ఎంఎల్‌ఎ నాయకర్‌ను కోరిన రోటరీ సభ్యులు
నరసాపురం : రాష్ట్ర ప్రభుత్వ విప్, నరసాపురం ఎంఎల్‌ఎ బొమ్మిడి నాయకర్‌ను బుధవారం నరసాపురంలో ఆయన స్వగృహంలో రోటరీ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నరసాపురంలో నెలకొన్న సమస్యలను ఎంఎల్‌ఎ నాయకర్‌కు తెలియజేసి వాటి పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో శ్మశానవాటికను అభివృద్ధి చేసి తీర్చిదిద్దాలన్నారు. గోదావరి జలాలు కాలుష్యం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండ్ దగ్గర క్లాక్ టవర్ ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసాపురం రోటరీ క్లబ్ అధ్యక్షురాలు గన్నాబత్తుల సత్యవతి, కోట్ల రామకృష్ణ, కనకం వరప్రసాద్, ఆత్మూరి రమా, సిహెచ్.మురళీ, తోట శ్రీధర్ ఉన్నారు.
ఆపదలోని వారికి అండగా మానవత
ఉండి : సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆపన్న హస్తం ఇస్తుందని పలువురు వక్తలు అన్నారు. మండలంలోని చెరుకువాడలో బుధవారం మోదుగుమూడి పెద్దిరాజు కుటుంబానికి ఉండి మానవత శాఖ ఆధ్వర్యంలో నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు, కొంత నగదు అందించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ మానవత సంస్థ సేవలు వెలకట్టలేనివి అన్నారు. సంస్థ మండల ఛైర్మన్ రుద్రరాజు యువరాజు, కో ఛైర్మెన్ దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ బాధల్లో ఉన్నవారికి అండగా నిలబడటమే మానవత ప్రధాన ధ్యేయం అన్నారు. సంస్థ కోశాధికారి కెటిఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐలు ముందుకు వచ్చి మానవతకు సహాయపడితే మరిన్ని సేవా కార్యక్రమాలు ఎక్కువ మందికి అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మానవత సభ్యులు రాములమ్మ, ఆర్‌ఎస్.బాబు, మాన్యం వాసు పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
అగ్నిమాపక అధికారి కె.భాస్కర్ రామమ్
నరసాపురం : అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నరసాపురం అగ్నిమాపక అధికారి కె.భాస్కర్ రామమ్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం పంజా సెంటర్ సువర్ణ అపార్ట్‌మెంట్ నివాసితులకు అగ్నిమాపక వారోత్సవాల ఉద్ధేశ్యం, అగ్నిప్రమాదలు జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు వివరించారు. అగ్నిమాపక అధికారి భాస్కర్ రామమ్ ఇంట్లో ఉపయోగించే ఎల్‌పిజి గ్యాస్ వాడటంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలిపారు. వంటగదిలో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభవిస్తే ఏవిధంగా ఆర్పాలో సిబ్బంది డెమో ద్వారా నివాసితులకు వివరించారు. అనంతరం వివిధ రకాల పరికరాల ద్వారా ఏవిధంగా అదుపుచేస్తారో డెమో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
మొగదిండిలో కిక్కిస తొలగింపు పనుల పరిశీలన
కాళ్ల : సీసలి-జక్కరం గ్రామాల మధ్య ఉన్న మొగదిండి మేజర్ మురుగు డ్రెయిన్‌లో పేరుకుపోయిన కిక్కిస, గుర్రపు డెక్క, తూడు తొలగింపు పనులను డిప్యూటీ స్పీకర్, ఉండి ఎంఎల్‌ఎ కనుమూరు రఘురాకృష్ణంరాజు బుధవారం పరిశీలించారు. మొగదిండి మేజర్ మురుగు కాలువల్లో సుమారు రూ.30 లక్షలతో 7.2 కి.మీ మేర చేపట్టిన పనులు పూర్తిగా నాణ్యతతో ఉండాలని డీసీ చైర్మన్ ఫణిబాబుకు ఆయన సూచించారు. నీటిసంఘాల నిరంతర పర్యవేక్షణలో గతంలో ఎన్నడూ చేయలేని విధంగా ఈసారి పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపాదికన కిక్కిస, గుర్రపు డెక్కను తొలగించడం జరుగుతుందన్నారు. ఉండి వాటర్ డీసీ చైర్మన్ తోట ఫణిబాబు, కొత్తపల్లి నాగరాజు, టిడిపి నాయకులు గాదిరాజు సుబ్బరాజు, బూడి వెంకట పర్రాలు, డ్రెయినేజీ ఎఇ లీలాప్రసన్న పాల్గొన్నారు.
అన్నక్యాంటీన్ పరిశీలన
నరసాపురం : అన్నక్యాంటీన్లలో అందిస్తున్న ఆహార పదార్థాలు, సమయంపై ప్రజలు తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తెలియజేయవచ్చని నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్య తెలిపారు. బుధవారం స్టీమర్ రోడ్డులోని అన్న క్యాంటీన్‌ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లలో రూ.5కే పేదలకు ఆహారం అందిస్తుందన్నారు. క్యాంటీన్ల సమయం, ఆహారంపై ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారన్నారు. అన్నక్యాంటీన్లలో ప్రతి రోజు నిర్ధేశిత సమయంలో ఆహారం అందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే క్యాంటీన్లలో ఉదయం 7 గంటల నుండే ఆహారం అందించేలా సమయం మార్చారన్నారు. కనుక క్యాంటీన్‌కు వచ్చే ప్రజలు తమ అభిప్రాయాలను క్యాంటీన్‌లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఇ రవిచంద్ర, ఎఇ దుర్గా కిషోర్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ పాత్రుడు పాల్గొన్నారు.
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రానీయకండి : ఎంఎల్‌ఎ
తణుకు : వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు, ఆయా గ్రామ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తణుకు ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశించారు. బుధవారం తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు చెందిన అధికారులు, సంబంధిత కార్యదర్శులతో తణుకు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాధాకృష్ణ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ నెలా మూడోవ శనివారం జరిగే స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర నిర్వహణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధానికి ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పంచాయితీ సిబ్బంది ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించారు. తణుకు నియోజకవర్గ పరిశీలకులు యర్రా వేణుగోపాల్‌రాయుడు, ఆయా గ్రామాలకు చెందిన కార్యదర్శులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎరువుల నియంత్రణ ఉత్తర్వుల ప్రయోగశాల సందర్శన
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం ఎరువుల నియంత్రణ ఉత్తర్వుల ప్రయోగశాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం సందర్శించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా తాడేపల్లిగూడెం ప్రయోగశాలలో రూ.27 లక్షలతో ఏర్పాటుచేసిన అటోమిక్ అబ్సెర్ప్షన్ స్పెక్ట్రో ఫోటోమీటర్‌ను, రూ.21 లక్షలతో ఏర్పాటు చేసిన గ్యాస్ లిక్విడ్ చోరోమెటోగ్రఫీ మిషనరీని ప్రారంభించారు. ప్రయోగ పరీక్షలు నిర్వహించే విధానాన్ని, శిక్షణ పొందిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఎడిఎ జె.శశి బిందు, డిడి శ్రీనివాస్, ఎఒలు వై.ఇందిరా ఝాన్సీ, ఎడిఎ మురళీకృష్ణ పాల్గొన్నారు.
ఉపాధి వేతన బకాయిలు చెల్లించాలి
సిఐటియు జిల్లా కౌన్సిల్ సభ్యులు పిల్లి ప్రసాద్
ప్రజాశక్తి – పోడూరు
ఉపాధి వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా కౌన్సిల్ సభ్యులు పిల్లి ప్రసాద్ డిమాండ్ చేశారు. జిన్నూరులో ఉపాధి పనిప్రదేశంలో కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.26 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. కూలీలకు తక్షణమే పే స్లిప్పులు ఇవ్వాలన్నారు. 200 రోజులు పని దినాలు కల్పించాలని, కనీస వేతనం రూ.600 ఇవ్వాలని కోరారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో కూలీలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. పనిప్రదేశంలో మజ్జిగను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేతల వేంకటేశ్వరు, కె.పద్మ, వై.బిందు పాల్గొన్నారు.