తణుకు ఎస్‌ఐ ఆత్మహత్య

Jan 31,2025 22:13 #'suicides', #AP police, #SI suspended

ప్రజాశక్తి – తణుకు రూరల్‌ : రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్‌ఐ మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… డాక్టర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కె గంగవరానికి చెందిన ఎజిఎస్‌ మూర్తి (38) తణుకు రూరల్‌ ఎస్‌ఐగా పని చేస్తున్న సమయంలో గేదెల అపహరణ కేసులో ఆరోపణలు రావడంతో గతేడాది నవంబర్‌లో ఉన్నతాధికారులు ఆయనను విఆర్‌కు పంపారు. ఈ నేపథ్యంలో పెనుగొండ సిఎం బందోబస్తు విధులకు హాజరయ్యేందుకు ఎస్‌ఐ మూర్తి భీమవరంలో రివాల్వర్‌ తీసుకుని గురువారం రాత్రి తణుకు సమీపంలోని పైడిపర్రులో ఉన్న ఇంటికొచ్చారు. శుక్రవారం ఉదయం 7.30లకు తణుకు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఎస్‌ఐ వాష్‌రూమ్‌కు వెళ్లొస్తా అని చెప్పి వెళ్లి సర్వీస్‌ రివాల్వర్‌తో పాయింట్‌ బ్లాంక్‌లో షూట్‌ చేసుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న ఆయనను పోలీసులు 108 వాహనంలో తణుకు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు భార్య విజయ, కుమారుడు చందన్‌, కుమార్తె దీక్షిత ఉన్నారు.

➡️