తీరప్రాంత పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

జిల్లా కలెక్టర్‌ నాగరాణి

ప్రజాశక్తి – భీమవరం

తీర ప్రాంత గ్రామాల పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యాశాఖ అధికారులను, ప్రధానో పాధ్యాయులను జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ నాగరాణి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు, పాఠశాలల పునర్‌ వవస్థీకరణపై డిఇఒ, నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్షించి మాట్లాడారు. పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా ఒక్క విద్యార్థి కూడా డ్రాప్‌ అవుట్‌ కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల పిల్లలు డ్రాప్‌అవుట్స్‌ కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రయివేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పిల్లలకు చక్కటి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. పునర్‌వ్యవస్థీకరణపై విద్యార్థుల తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఒకరిద్దరు ఉన్న పాఠశాలల కన్నా, ఎక్కువ మంది విద్యార్థులు కలిగిన పాఠశాలలో చదువుకోవడం ద్వారా ఒకరి నుండి ఒకరికి అనేక విషయాలు తెలుసుకోవడానికి వీలవుతుందని, తద్వారా వారికి మంచి ఆలోచనలు, తెలివితేటలు కలుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి మండలాల ఎంఇఒలు పి.పుష్పరాజ్యం, జి.జాన్‌ ప్రభాకర్‌, జి.వీరాస్వామి, ఎన్‌విఎస్‌జి.శర్మ, డి.సుభకరరావు, కె.వెంకట రామకృష్ణ రాజు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️