ఇఒపిఆర్‌డి ఎంవిఎస్.రాంప్రసాద్
ప్రజాశక్తి – పాలకోడేరు
చెత్త నుంచి సంపద తయారు చేసి పంచాయతీలకు ఆదాయం సమకూర్చడంలో భాగంగా ఎస్‌డబ్ల్యూపిసి కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మండల విస్తరణ అధికారి ఎంవిఎస్.రాంప్రసాద్ తెలిపారు. గ్రామాల్లో నిరంతరం ఇంటింటా చెత్త సేకరించి తడి, పొడి చెత్తను వేరుచేసి ఎస్‌డబ్ల్యూపిసి కేంద్రాల ద్వారా సంపద సృష్టించడం జరుగుతుందన్నారు. వీటి ద్వారా పంచాయతీలకు ఆదాయం లభించడమే కాకుండా సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు. మండలంలో ఎస్‌డబ్ల్యూపిసి కేంద్రాల నిర్వహణ, తాగునీటి సరఫరా, పన్నుల వసూలు, నాన్ లేఅవుట్లు, తాగునీటి పథకాలు తదితర అంశాలపై ప్రజాశక్తి నిర్వహించిన చిట్‌చాట్‌లో ఇఒపిఆర్‌డి.రాంప్రసాద్ మాట్లాడారు. ప్రశ్న : మండలంలో ఎస్‌డబ్ల్యూపిసి కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? ఏ గ్రామాల్లో ఇంకా ఏర్పాటు కాలేదు?మండలంలో 14 గ్రామాలు ఉన్నాయి. వాటిలో 11 గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ (ఎస్‌డబ్ల్యూపిసి) కేంద్రాలు ఉన్నాయి. శృంగవృక్షం, పెన్నాడ, అగ్రహారం, మోగల్లు గ్రామాల్లో ఈ కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. పెన్నాడ అగ్రహారంలో కేంద్రం ఏర్పాటుకు గ్రామసభ నిర్వహించడం జరిగింది. మరికొన్ని రోజుల్లో ఇక్కడ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నాం.ప్రశ్న : వర్మీ ఏ గ్రామంలో అందుబాటులో ఉంది? కిలో ఎంత ధరకు విక్రయిస్తున్నారు?ఒక టన్ను చెత్త ద్వారా సుమారు 400 కేజీల వర్మీ తయారవుతుంది. ప్రస్తుతం వర్మీ విస్సాకోడేరులో అందుబాటులో ఉంది. పాలకోడేరు, కోరుకొల్లు, గొల్లలకోడేరు, వేండ్ర గ్రామాల్లోని ఎస్‌డబ్ల్యూపిసి కేంద్రాల ద్వారా మరో 15 రోజుల్లో వర్మీ అందుబాటులోకి వస్తుంది. కేజీ రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు.ప్రశ్న : పారిశుధ్య నిర్వహణకు ఎటువంటి చర్యలు చేపట్టారు? ప్రతి గ్రామంలో రోజూ క్రమం తప్పకుండా ఇంటింటా చెత్త సేకరిస్తున్నాం. పారిశుధ్య సిబ్బంది తక్కువగా ఉన్నచోట ఎక్కువ మందిని పెట్టుకునే విధంగా చర్యలు చేపట్టాం. అలాగే చెత్త తీసుకెళ్లే రెక్షాలను అందుబాటులోకి తెచ్చాం. ప్రతి వార్డులో తడి, పొడి చెత్త సేకరిస్తున్నాం. సేకరించిన చెత్తను ఎస్‌డబ్ల్యూపిసి కేంద్రాలకు తరలించి అక్కడ రీసైక్లింగ్ చేసి వర్మీని తయారు చేయడం జరుగుతుంది.ప్రశ్న: వచ్చే వేసవిలో తాగునీటి ఇబ్బందులు అధిగమించేందుకు చర్యలు చేపట్టారా?ఇప్పటికే తాగునీటి చెరువులను నీటితో నింపే చర్యలు తీసుకున్నాం. 15 రోజులకోసారి ఫిల్టర్‌బెడ్‌లు, వాటర్ ట్యాంకులను పిఆర్‌ఐ యాక్టర్ ప్రకారం శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేశాం. విస్సాకోడేరులో అధునాతన టెక్నాలజీతో ఫీట్రీట్ మెంట్ మైక్రో ప్లాంట్ ఏర్పాటుచేసి సురక్షిత నీటిని అందిస్తున్నాం. అలాగే పెన్నాడ అగ్రహారంలో మైక్రో ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు, తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. ప్రశ్న : నాన్ లేఅవుట్లపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు?మండలంలో పుట్టగొడుగుల్లా నాన్ లేఅవుట్లు ఉన్నాయి. వీటికి ఎటువంటి అనుమతులు లేవు. పాలకోడేరు వంటి మేజర్ పంచాయతీ పరిధిలోని నాన్ లేఅవుట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. వీటిని తొలగించిన ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. అక్రమంగా లేఅవుట్లు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రశ్న : పన్ను వసూలు ఏ విధంగా ఉంది? 2024-2025కు సంబంధించి రూ.2 కోట్ల 80 లక్షలు ఏరియా ఉంది. దీనిలో ఇప్పటివరకూ సుమారు రూ. కోటీ 80 లక్షలు వసూలు చేశాం. ఈ నెల 20వ తేదీలోపు 80 శాతం, నెలాఖరులోపు నూరుశాతం పన్ను వసూలు చేసేందుకు లక్ష్యంగా తీసుకున్నాం.