ప్రజాశక్తి – భీమవరం
జిల్లాలో దశలవారీగా ప్లాస్టిక్‌ను నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్లో కలెక్టర్ నాగరాణిని హైదరాబాద్ ఎఇ టెక్నాలజీ కంపెనీ ప్రతినిధులు కలిసి, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వారు తయారుచేసి ప్రదర్శించిన బయో ఎలైట్ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి కె.దిలీప్ మాట్లాడుతూ వాటర్ బాటిల్, వాటర్ గ్లాస్, లిక్కర్ గ్లాస్, స్ట్రా, వివిధ రకాల క్యారీ బ్యాగులు, వివిధ సైజుల్లో డస్ట్ బిన్ కవర్స్, రెస్టారెంట్లో, కర్రీ పాయింట్‌లో వినియోగించే ఫుడ్ ప్యాకింగ్ డబ్బాలు, కర్రీ ప్యాకింగ్ కవర్స్, భోజనం ప్లేట్లు, మొక్కజొన్న కండి లోపలి భాగాన్ని వినియోగించి తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. తయారు చేసిన ఉత్పత్తులు సుమారు నాలుగు నుంచి ఐదు నెలల కాలంలో భూమిలో డీ కంపోస్ట్ అవుతాయని వివరించారు. శ్రీశైలం, కేరళ దేవాలయాల వద్ద వాటర్ బాటిల్స్ అమ్మకాలకు అనుమతులు లభించాయని, త్వరలో సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో దశలవారీగా ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మొట్టమొదటిగా కలెక్టరేట్‌లోని అన్ని కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిల్స్‌కు బదులుగా స్టీల్ బాటిల్స్, స్నాక్స్ ప్లేట్స్, టీ తాగడానికి గాజు, స్టీల్ వాటర్ గ్లాసులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఫిబ్రవరి 1 నుంచి పట్టణంలోని అన్ని టీ స్టాల్స్‌లో, మద్యం షాపుల్లో ప్లాస్టిక్ టీ గ్లాసులు, వాటర్ గ్లాసులు, వివిధ వాణిజ్య అంగళ్లల్లో క్యారీ బ్యాగులు నిషేధిస్తూ ప్రకటించడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఉన్నారు.