ప్రజాశక్తి – భీమవరం
పశువుల సంరక్షణకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా జంతు సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. జంతువుల పట్ల దయ, కారుణ్యం కలిగి ఉండాలన్నారు. మూగ జీవాలను హింసించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జంతు సంరక్షణ సామాజిక బాధ్యత అన్నారు. సంక్రాంతి పండుగ పేరు చెప్పుకుని కోడి పందేలు నిర్వహించటం చట్టరీత్యా నేరమన్నారు. జిల్లా ఎఎస్‌పి వి.భీమారావు మాట్లాడుతూ కోడి పందేలు, బరులు నిర్వహించకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలుకు సూచించామని, దీనిపై మైక్ ప్రచారం కూడా చేపట్టనున్నామని వివరించారు. అనంతరం కోడిపందేల నిషేధంపై వాల్‌పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ మొగలి వెంకటేశ్వర్లు, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ కె.మురళీకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి బి.అరుణశ్రీ, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, జిల్లా జంతు సంక్షేమ సంఘం అధికార, అనధికార సభ్యులు పాల్గొన్నారు.