ప్రజాశక్తి – తణుకు
గత సమ్మె కాలంలో మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, జిఒలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యాన మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన, ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ విల్సన్ జైకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్, యూనియన్ నాయకులు ఎన్.ఆదినారాయణబాబు, ఉండ్రాజవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు. రోజురోజుకూ పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్ ఛార్జీలు భారీగా పెరుగుతున్నా తమ వేతనాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కాలంలో తమకు మద్దతిచ్చిన టిడిపి, జనసేన నేడు అధికారంలో ఉన్నా సమస్యలు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో సమరశీల పోరాటాలు సాగిస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా శ్రామిక కన్వీనర్ అడ్డగర్ల అజయకుమారి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు గార రంగారావు, గెల్ల విజయకుమార్, పి.జ్యోతిబాబు, డి.వెంకటేశ్వరరావు, అర్జి కృష్ణబాబు, కుసుమ, గన్నిరాజు, శ్రీదేవి, పుష్పరాణి, బ్రహ్మాజీ, మందులయ్య, అరుణాదేవి, సుధాకర్, అయ్యప్ప, మణికంఠ, శిరీష పాల్గొన్నారు.భీమవరం టౌన్ : మున్సిపల్ కార్మికులకు సమ్మెకాల ఒప్పందాలను అమలు చేయాలని, పనికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, ఇంజినీరింగ్ కార్మికులకు నెల రూ.26,000 జీతం ఇవ్వాలని సిఐటియు భీమవరం పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భీమవరం మున్సిపల్ ఆఫీస్ వద్ద శుక్రవారం నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైనా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమన్నారు. పట్టణాలు పరిశుభ్రంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలకు సిఐటియు జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు సంఘీభావం తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నేలపు రాజు, బంగారు వరలక్ష్మి, బంగారు ఏసేబు, ధనాలు చినపెద్దిరాజు నీలాపు నాగేశ్వరరావు, నీలాపు అప్పన్న, మాడుగుల రత్నకుమారి, మాడుగుల పద్మ, పల్లా రాజు నాగమణి పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం : మున్సిపల్ కార్మికుల సమ్మెకాలపు హామీలు జిఒగా అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రారు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు 17 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. కార్మికులకు రిటైర్మెంట్ వయసు పెంచాలని, మరణించిన వారికి మట్టి ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ డిమాండ్లన్నీ పరిష్కరించి జిఒలు విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కర్రి నాగేశ్వరరావు, ధనాల వెంకటరావు, తాడికొండ జయరాం కృష్ణ, కొడమంచిలి బాబు, ధనరాజు పాల్గొన్నారు. నరసాపురం : మున్సిపల్ ఉద్యోగ, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సమ్మె కాలంలో ఇచ్చిన ఒప్పందాలను, జిఒల రూపంలో జారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగ, కార్మిక నాయకులు నల్లి థామస్, చిక్కాల వాసు, కమిటీ సభ్యులు కున వెంకటరమేష్, జివివి.సత్యనారాయణ, తోట పార్థసారథి, షేక్ అమీనా, టి.కళ్యాణి, డి.రాజ్యలక్ష్మి, పడవల శ్రీనివాస్ పాల్గొన్నారు.