జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ విజయకృష్ణ
ప్రజాశక్తి – ద్వారకా తిరుమల
మండలంలోని తిరుమలంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినియోగదారుల క్లబ్ ఏర్పాటు చేసి అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శేషు కుమారి అధ్యక్షత వహించగా జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని క్లబ్బు ఏర్పాటుని పర్యవేక్షించారు. అధ్యాపకులు బంగారు రాజు క్లబ్ నిర్వహణకు ఎంపిక చేయబడిన విద్యార్థులను సభకు పరిచయం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో వినియోగదారుల క్లబ్ సభ్యులచే విజయకృష్ణ ప్రమాణం చేయించారు. అనంతరం జరిగిన అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తే సమాజం శక్తివంతమౌతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ప్రతి విద్యార్థికి చట్టాలపై అవగాహన కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వినియోగదారుల క్లబ్‌లను ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టిందని అన్నారు. నిత్య జీవితంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని వినియోగదారుల హక్కుల చట్టం ద్వారా ఏ విధంగా పరిష్కరించుకోవాలి, వినియోగదారుల కమిషన్లు వాటి పనితీరు తదితర అంశాలను సోదాహరణంగా వివరిస్తూ విజయకృష్ణ సభికులకు అవగాహన కల్పించారు. హెచ్‌ఎం శేషుకుమారి మాట్లాడుతూ పాఠశాల క్లబ్‌కు ఎంపికైన విద్యార్థులు వినియోగదారుల సమస్యలు, పరిష్కారాలపై తాము అవగాహన పెంచుకోవటమే కాకుండా తోటి విద్యార్థులకు, తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ ఛైర్మన్, వైఎస్.చైర్మన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.