ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి

ఎంఇఒ-2 రాజేంద్ర ప్రసాద్‌

ప్రజాశక్తి – ఆచంట

ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు నేడు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎంఇఒ-2 పి.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సోమవారం ఆచంట ఎంవిఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన స్కూల్‌ బ్యాగులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్‌ పాఠశాలకు దీటుగా మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని, నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యను అందించడంతో పాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అమలు చేస్తూ విద్యార్థి సంపూర్ణ వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదం చేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 13వ తేదీన ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు నోట్‌ బుక్స్‌ అందుబాటులో ఉంచామని, స్కూల్‌ బ్యాగ్‌లో బెల్టులు, బూట్లను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.

➡️