ప్రజాశక్తి – భీమవరం
విభిన్న ప్రతిభావంతులు ఉన్నతంగా చదువుకుని జీవితంలో స్థిరపడేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక డిఎన్‌ఆర్ కళాశాలలో విభిన్న ప్రతిభావంతులకు ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి క్రీడా పోటీలను ఆమె జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు ఎవరికీ తీసిపోని విధంగా పారా ఒలంపిక్స్‌లో సైతం అనేక మెడల్స్‌ను సాధిస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడలతోపాటు చదువు చాలా ముఖ్యమని, విభిన్న ప్రతిభావంతులు ప్రతిఒక్కరూ తప్పక చదువుకునేలా సంబంధిత సంఘాలు, అధికారులు కృషి చేయాలన్నారు. వీరి కోసం జిల్లాలోని 20 మండలాల్లో భవిత కేంద్రాలను ఏర్పాటు చేశామని, విభిన్న ప్రతిభావంతులను భవిత సెంటర్లో చేర్చి అక్కడ అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని అన్నారు. బాగా చదువుకుంటేనే వారిలో ఆత్మ స్థయిర్యం పెరుగుతుందని, వారి కాళ్లపై వారు నిలబడే స్థాయికి చేరుకుంటారని తెలిపారు. ప్రతిఒక్క విభిన్న ప్రతిభావంతుడు తప్పక చదువుకోవాలని, ప్రత్యేక అవసరాలు కలిగి ఉండి ఉన్నత స్థానాలకు ఎదిగిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతోపాటు వారి అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. సాధారణ ప్రజలకే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న ఈ తరుణంలో విభిన్న ప్రతిభావంతుల అవసరాల మేరకు ప్రత్యేక వైద్య సదుపాయాలను అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పలు అసోసియేషన్ల ప్రెసిడెంట్లు విజ్ఞాపనల మేరకు ప్రతి మూడు నెలలకోసారి ప్రత్యేక వికలాంగుల గ్రీవెన్స్ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ, ఏలూరుకు సంబంధించిన సిబ్బంది కొందరిని భీమవరంలో విధులు నిర్వహించేలా ఆదేశిస్తామని, అలాగే కమ్యూనిటీ హాలు నిర్మాణానికి పరిశీలిస్తామని చెప్పారు. శారీరక వైకల్యం కలిగిన వారికి మూడు చక్రాల రిక్షా రేస్, జావెలిన్ త్రో, షాట్‌పుట్ పోటీలు, దృష్టి లోపం కలిగిన వారికి పరుగుపందెం, షాట్‌పుట్, క్రికెట్ (సీనియర్స్), బధిరులు (మూగ) వారికి పరుగుపందెం, షాట్‌పుట్, క్యారమ్స్, మానసిక వైకల్యం కలిగిన వారికి పరుగుపందెం, సాఫ్ట్‌బాల్, డిస్కస్ త్రో తదితర క్రీడలను నిర్వహించామన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో అల్పాహారాన్ని, డిఎన్‌ఆర్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్‌కుమార్, ఎస్‌ఎస్‌ఎ పిఒ శ్యాంసుందర్, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, డిఎన్‌ఆర్ కళాశాల ప్రెసిడెంట్ జి.నరసింహరాజు, సెక్రటరీ గాదిరాజు బాబు, విజువల్లీ హ్యాండీక్యాప్డ్ ప్రెసిడెంట్ బి.వెంకట రామారావు, ఆర్థోపెటిక్ హ్యాండీక్యాప్డ్ ప్రెసిడెంట్ ఎ.నటరాజ్, హియరింగ్ హ్యాండీక్యాప్డ్ ప్రెసిడెంట్ టి.రాము, స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిహెచ్.తాతారావు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు టి.త్రిమూర్తులు, వి.లక్ష్మణ్, కె.సురేష్, సిహెచ్.వాసు పాల్గొన్నారు.