అలుపెరగని పోరాట యోధుడు సుందరయ్య

May 19,2024 13:45 #West Godavari District

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం :  తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన యోధుడు సుందరయ్యని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కర్రీ నాగేశ్వరరావు అన్నారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు,తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభను ఆదివారం తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనములో జవ్వాది శ్రీను అధ్యక్షతన జరిగింది.పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ వర్థంతి సభకు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు పుట్టా వేణు గోపాల చౌదరి,సిరపరపు రంగారావు, కరెడ్ల రామకృష్ణ లు హాజరై మాట్లాడుతూ సుందరయ్య గారు 1913 లో నెల్లూరు జిల్లా అలగాని పాడు గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించారని, గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితులైన ఆయన 17 ఏట ఉద్యమ బాట పట్టారని వారు అన్నారు.1946 నుండి 1952 వరకు తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన యోధుడు సుందరయ్యని, ఆ పోరాటంలో లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచారని వారు తెలిపారు. 1977లో కృష్ణాజిల్లా దివిసీమలో వచ్చిన ఉప్పెనలో సుమారు పదివేల మంది చనిపోయారని, అక్కడ పారిశుద్ధ్య పనులు నిర్వహించడానికి వందలాదిమంది కార్యకర్తలను సమీకరించి నెల రోజులపాటు పనులు పూర్తి చేశారని వారు తెలిపారు. ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు 2500 కిలోమీటర్లు పాదయాత్ర జరిపి వందలాది గ్రామాలు సందర్శించి రైతాంగ సమస్యలు తీసుకుని మద్రాసు శాసనసభలో రైతు సమస్యలు మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి విజయం సాధించారని వారు తెలిపారు. శాసనసభసభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన ఆయన చాలా నిరాండంబరంగా, సైకిల్ మీద అసెంబ్లీకి, పార్లమెంట్ కి వెళ్లేవారని వారు అన్నారు. ఏదైనా విషయాన్ని మాట్లాడాలంటే దాని మీద లోతుగా చర్చించి మాట్లాడే వారిని వారు తెలిపారు. ఆంధ్రరాష్ట్రం నుండి కేరళ వరకు పాదయాత్ర జరిపి ఎంతోమంది కార్యకర్తలను తయారు చేశారని, ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారని ఆయనకు కూడా దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు నేతగా గుర్తింపు పొందారని తెలిపారు. కమ్యూనిస్టు కుటుంబాలను వారి ఆర్థిక పరిస్థితులను వారి జీవన ప్రమాణాలను అర్థం చేసుకొని వారికి సహకరించే వారని తెలిపారు. ఈ కార్యక్రమానికి కర్రి సాయిరెడ్డి, చల్లా చంద్రరావు, గొన్నాబత్తుల నాగేశ్వరరావు,నరమాల కృష్ణ,మేట్రేడ్డి రమణ,పులిమంతుల రమణ, బంకురు యశోద,పకుర్తి చిన్న అప్పారావు, వడిసెల శ్రీను తదితరులు మరియు తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ సభ్యులు హాజరయ్యారు.

➡️