తాళ్లకోడు కాలనీని ఆకివీడులో కలపాలి

ప్రజాశక్తి – ఆకివీడు

తాళ్లకోడు కాలనీని ఆకివీడు నగర పంచాయతీలో కలపాలని సిపిఎం ఆధ్వర్యంలో కాలనీవాసులు తాళ్లకోడు కాలనీలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, తాగునీరు సరఫరా చేయాలని, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని, డ్రెయినేజీ సౌకర్యం కల్పించాలని నినదించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కె.తవిటినాయుడు, పట్టణ కమిటీ సభ్యులు పెంకి అప్పారావు, బివి వర్మ మాట్లాడుతూ 3,000 మందికిపైగా నివాసం ఉంటున్న తాళ్లకోడు కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వరం ఎంఎల్‌ఎ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రానున్న వేసవిలోపు కాలనీవాసులకు తాగునీరు అందుబాటులోకి తేవాలని, ఓవర్‌ హెడ్‌ ట్యాంకును ఏర్పాటు చేయాలని కోరారు. తాళ్లకోడు కాలనీలో 90 శాతానికి పైగా ఆకివీడు నగర పంచాయతీకి చెందిన ప్రజలేనని గుర్తు చేశారు. ఈ కాలనీని ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో ఉంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కె.సరోజినీ, ఎ.దేవి, ఎన్‌.లక్ష్మి, లక్ష్మీదుర్గ, బి.నాగు, బి.ఏసు, శామ్యూల్‌, రత్నమాల, ఎం.కృష్ణకుమారి పాల్గొన్నారు.

➡️