పాలకోడేరు హౌసింగ్ ఎఇ నరసింహారావు
ప్రజాశక్తి – పాలకోడేరు
జూన్ నెలాఖరు నాటికి మండలంలో 213 గృహ నిర్మాణాలు పూర్తి చేయడమే లక్ష్యంగా తీసుకున్నట్లు పాలకోడేరు హౌసింగ్ ఎఇ బివి.నరసింహారావు తెలిపారు. ఇప్పటికే గృహ నిర్మాణాలు వేగవంతం చేసేందుకు అన్ని విధాలా చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యంగా ప్రతి లబ్ధిదారుడూ గృహం నిర్మించుకునే విధంగా వారికి అవగాహన కల్పించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రజాశక్తి నిర్వహించిన చిట్‌చాట్‌లో హౌసింగ్ ఎఇ నరసింహారావు వివరాలు వెల్లడించారు.ప్రశ్న : మండలంలో 213 గృహ నిర్మాణాలే లక్ష్యంగా తీసుకోవడానికి కారణం ఏమిటి? ఎఇ : రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుంది. దీనిలో భాగంగా జిల్లాలో సుమారు 7 వేల నిర్మాణాలు లక్ష్యంగా తీసుకోగా మండలానికి వాటాగా 213 గృహాలు వాటాగా వచ్చాయి. 14 గ్రామాల్లో 340 గృహాలు నిర్మించాలనుకున్నాం. ఇప్పటివరకూ 169 గృహాలు గుమ్మాల దశలో ఉన్నాయి. 7 గృహాలకు స్లాబ్ దశ పూర్తయ్యింది. మరో 164 స్లాబ్ దశలో ఉన్నాయి. మూడు నెలల్లో 213 గృహాలు నిర్మించాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.ప్రశ్న : పిఎంఎవై 2.0 పథకంలో ఇప్పటివరకూ ఎన్ని దరఖాస్తులు అందాయి?ఎఇ : గృహం కావాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మంజూరు చేయడం జరుగుతుంది. పిఎంఎవై 2.0 పథకంలో ఇప్పటివరకూ 83 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ గృహాలు మంజూరు చేశాం. ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రశ్న : గతంలో గృహ నిర్మాణాలకు తీసుకున్న లక్ష్యం చేరుకున్నారా? ఎఇ : గత ప్రభుత్వ హయాంలో 2,380 గృహాలు నిర్మించాలని లక్ష్యంగా తీసుకున్నాం. కొంతమేర లక్ష్యం చేరుకోగలిగాం. సుమారు 1,041 గృహ నిర్మాణాలు పూర్తి చేశాం. 1,339 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రశ్న : ఎంత శాతం గృహ నిర్మాణాలు పూర్తి చేశారు?ఎఇ : మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేఅవుట్లలో 1,782 గృహాలు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ముందుకొచ్చారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే సొంత స్థలంలో 598 మంది లబ్ధిదారులు గృహాలు నిర్మించుకున్నారు. మొత్తం 59 శాతం గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి.ప్రశ్న : ఎస్‌సి, ఎస్‌టి లబ్ధిదారులకు రుణ సాయం పెరిగే అవకాశం ఉందా? ఎఇ : సొంతింటి కల నిజం చేసుకోవాలని అందరికీ ఉంటుంది. దీనికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టిలంతా గృహాలు నిర్మించుకోవాలని ప్రభుత్వ ఆలోచన. రుణ సాయాన్ని పెంచే విధంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. లబ్ధిదారుల గృహ నిర్మాణానికి ఈ సాయం ఎంతో మేలు చేకూర్చనుంది.