లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించాలి

ప్రజాశక్తి – నరసాపురం

ఇంటి స్థలం, ఇల్లు లేని లబ్ధిదారులకు స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఇల్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, కాలనీల్లో మౌలిక సదుపాయాలు వంటి సమస్యల పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య సైకిల్‌ యాత్ర ఆదివారం నరసాపురం చేరుకుంది. స్థానిక అంబేద్కర్‌ సెంటర్లో పార్టీ పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్‌ మాట్లాడుతూ జిల్లాలో 2019-2024లో 649 లేఅవుట్‌లో 1,532 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం సేకరించారన్నారు. 64,315 మందికి పట్టాలు ఇచ్చారని, పూడిక అవ్వనివి చాలా ఎకరాలు ఉన్నాయని తెలిపారు. కొద్ది మందికి మాత్రమే గతంలో ఇళ్ల నిర్మాణం జరిగిందని పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరిగి సొంతిల్లు పొందని లబ్ధిదారులు చాలా మంది ఉన్నారని తెలిపారు. పేదవాడి సొంతింటి కలను నిజం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వానికి రెడ్‌ బుక్‌పై ఉన్న చిత్తశుద్ధి హామీల అమల్లో లేదని విమర్శించారు. తక్షణం ఇళ్ల సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ సైకిల్‌ యాత్ర 500 కిలోమీటర్ల మేర 20 మండలాలు, ఆరు పట్టణాల మీదుగా వెళ్తుందని, ఈ యాత్రలో వచ్చే ప్రజా సమస్యల పరిష్కారానికై ఈ నెల 17వ తేదీన జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు, పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని లబ్ధిదారులకు మంగళగుంటపాలెంలో స్థల సేకరణ చేశారు గాని పూర్తిస్థాయిలో పూడిక చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం సంబంధిత అధికారులు ఆ స్థలాన్ని పూర్తిస్థాయిలో పూడిక చేసి లబ్ధిదారులకు రెండు సెంట్ల స్థలాన్ని కేటాయించాలన్నారు. తక్షణం లేఅవుట్‌లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జెక్కంశెట్టి సత్యనారాయణ, కారుమంచి క్రాంతిబాబు, మామిడి శెట్టి రామాంజనేయులు, గొర్ల రామకృష్ణ, శేషపు అశ్రియ, ఇంజేటి శ్రీనివాసు పట్టణ కమిటీ సభ్యులు మంచి నీలకంఠం, నోములకొండ, కోడి లక్ష్మణ్‌, మండల కార్యదర్శి జల్లి రామ్మోహన్‌రావు, గుత్తుల శ్రీరామచంద్రుడు పాల్గొన్నారు.నరసాపురం నుంచి కొత్త నవరసపురం, పాత నవరసపురం దళిత గ్రామాలకు వెళ్లే రోడ్డును ఉద్దేశపూర్వకంగానే నిర్మించడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు, జిల్లా కమిటీ సభ్యులు కె.క్రాంతిబాబు విమర్శించారు. సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య సైకిల్‌ యాత్ర ఆదివారం నరసాపురం మండలం చేరుకున్న సందర్భంగా దళితులతో యాత్ర బృందం మాట్లాడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నరసాపురం నుంచి కొత్త నవరసపురం, పాత నవరసాపురం వెళ్లే రోడ్డు అత్యంత అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా నేటికీ దళితుల పట్ల వివక్ష తగ్గడం లేదన్నారు. తక్షణం రోడ్డు నిర్మించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బందం సభ్యులు, దళితులు పాల్గొన్నారు.యలమంచిలి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలకు బడ్జెట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, కాలనీల్లో మౌలిక సదుపాయాలు వంటి సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సిపిఎం ప్రజా చైతన్య సైకిల్‌ యాత్ర ఆదివారం యలమంచిలి మండలం ఏనుగు వాని లంక, కలగంపూడి, చించినాడ, యలమంచిలి, ఆర్యపేట, మేడపాడు, అడవిపాలెం మీదుగా పాలకొల్లు వైపు సాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని జగనన్న ఇళ్ల స్థలాలను పరిశీలించి స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికీ చాలామంది ప్రభుత్వం అందించే సాయం సరిపోకపోవడంతో ఇళ్లు నిర్మించుకోలేదని బృందం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోపాలన్‌ మాట్లాడుతూ పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం తరపున కనీసం ఐదు లక్షల రూపాయల సాయం అందించాలని, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం మూడు సెంట్ల ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని, కాలనీల్లో తాగునీరు, కరెంటు, రోడ్లు, డ్రెయిన్లు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. సిపిఎం ప్రజా చైతన్య సైకిల్‌ యాత్రలో భాగంగా చించినాడ చేరుకున్న దళానికి ఓ భూస్వామి ఎస్‌సి శ్మశానానికి ఆనుకొని రొయ్యల చెరువు తవ్వేశారని దీని కారణంగా చెరువులో ఊట నీరు మొత్తం బయటకు చేరి శ్మశానంలో మోకాలు లోతు నీరు నిలిచిపోయిందని, ఎవరైనా చనిపోతే పూడ్చి పెట్టుకునే పరిస్థితి లేదని స్థానికులు తెలియజేయడంతో అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా గోపాలన్‌ యలమంచిలి తహశీల్దార్‌ గ్రంధి పవన్‌ కుమార్‌తో ఫోన్లో మాట్లాడుతూ ఎస్‌సి శ్మశానవాటిక పక్కన అసలు చెరువు తవ్వడానికి అనుమతులు లేవని, సంబంధిత భూస్వామి నిబంధనలకు అతిక్రమించి రొయ్యల చెరువు తవ్వడం అన్యాయమని, వెంటనే చర్యలు తీసుకొని గట్టును దూరంగా తరలించాలని లేకుంటే సిపిఎం జిల్లా నాయకత్వంలో ప్రజలను సమీకరించి పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కానేటి బాలరాజు, నాయకులు కె.క్రాంతిబాబు, జక్కంశెట్టి సత్యనారాయణ, గొర్ల రామకృష్ణ, శేషపు అశ్రియ్య, బత్తుల విజయకుమార్‌, దేవ సుధాకర్‌, గొల్ల ఏడుకొండల శ్రీనివాస్‌, ముమ్మిడివరపు ఆంజనేయులు, తెన్నేటి స్టాలిన్‌, శెట్టిమి భాస్కరరావు, పల్లేరు వెంకటస్వామి, తెన్నేటి శివాజీ, భారతుల పద్మరాజు పాల్గొన్నారు. పాలకొల్లు:టిడ్కో గహాలను వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి గోపాలన్‌ కోరారు. ప్రజా చైతన్య సైకిల్‌ యాత్ర ఆదివారం సాయంత్రం పాలకొల్లు చేరింది. ఈ క్రమంలో బృందం పట్టణంలోని టిడ్కో గృహాలను పరిశీలించి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకున్నారు. బతికుండగా ఇల్లు వస్తుందా అని పలువురు బృందం వద్ద ఆవేదన వ్యక్తం చేశౄరు. 2016లో టిడ్కో గృహం కోసం అప్పుచేసి లక్ష కట్టామని ఇల్లు స్వాధీనం లేక అద్దె ఇంట్లో ఉంటున్నామని తెలిపారు. ఇప్పుడు బ్యాంకు వాయిదాలు కట్టలేదని ఇల్లు జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు ఇంట్లో కూర్చుంటే ఇల్లు రాదని పోరాడాలని గోపాలన్‌ తెలిపారు. ఈ నెల 17న జిల్లా కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా నిర్వహిస్తున్నామని, లబ్ధిదారులు హాజరు కావాలని కోరారు. బృందంలో మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్‌, సిపిఎం నేతలు జక్కంశెట్టి సత్యనారాయణ, రామాంజనేయులు, జవ్వాది శ్రీనివాస్‌, చల్లా సోమేశ్వరరావు, కానేటి బాలరాజు, యర్రా అజరు పాల్గొన్నారు.

➡️