వామపక్ష మేధావి సీతారాం ఏచూరి మృతి బాధాకరం

సంస్మరణ సభలో సిపిఎం నేతల నివాళి

ప్రజాశక్తి – నరసాపురం

భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసం, లౌకిక శక్తులను ఏకం చేస్తూ భారత రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి, వామపక్ష మేధావి సీతారాం ఏచూరి మృతి తీరని లోటు అని పలువురు నాయకులు నివాళులర్పించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం సంస్మరణ సభ స్థానిక అల్లూరి సత్యనారాయణ రాజు సాంస్కృతిక కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ విద్యార్థిగా ఉన్నప్పుడే ఏచూరి భారత సమాజం పట్ల పూర్తి అవగాహన ఏర్పరచుకున్నారన్నారు. దేశ సామాజిక అసమానతలను అధ్యయనం చేసిన ఏచూరి విద్యార్థిగా పలు ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు. సిపిఎం నాయకునిగా పలు ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిన ఆదర్శ ప్రజా నాయకుడని కొనియాడారు. దేశంలో మతన్మోదానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటాన్ని ఆయన సాగించారన్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో ప్రత్యామ్నాయ ప్రజానుకూల విధానాలను రూపొందించి, వాటిని అమలు చేయించారని గుర్తు చేశారు. పార్లమెంట్‌ సభ్యునిగా ఏచూరి దేశంలోని ప్రజా సమస్యలపై తనదైన శైలిలో గళమెత్తి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ప్రశంసలు అందుకున్నారన్నారు. ఏచూరి జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అందరిపై ఉందని ఆయనకు నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర సీనియర్‌ నాయకులు నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ ఏచూరి మృతితో భారత దేశం గొప్ప వామపక్ష మేధావిని కోల్పోయిందన్నారు. నరసాపురం మాజీ ఎంఎల్‌ఎ బండారు మాధవనాయుడు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించిన ఏచూరి తెలుగువారు కావడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ఏచూరి విద్యార్థి ఉద్యమంలో చేసిన పోరాటాలు ఎంతో స్పూర్తిని ఇచ్చేవన్నారు. సిపిఎం నాయకునిగా దేశంలో వివిధ సమస్యలను ప్రస్తావించిన తీరు అందరినీ ఆలోచింపచేసేవన్నారు. నరసాపురం న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చేగొండి మోహన్‌ బాలాజీ మాట్లాడుతూ ఏచూరి ఆదర్శవంతమైన ప్రజానాయకుడన్నారు. న్యాయవాది సోడదాసి శ్రీధర్‌ మాట్లాడుతూ దేశం ఎదొర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం చూపిన గొప్ప మేధావి ఏచూరి అని అన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏచూరి మృతి చాలా బాధాకరమని తెలిపారు. సభకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కవురు పెద్దిరాజు అధ్యక్షత వహించారు. సభలో రెడ్డప్ప ధవేజీ, చౌకడిపో డీలర్ల సంఘం అధ్యక్షులు అధికార ఏసు, వేములదీవి మాజీ సర్పంచి అడ్డాల శ్రీనివాస్‌ రావు, కాంగ్రెస్‌ నాయకులు కానూరి బుజ్జి, న్యాయవాది పూరిళ్ల శ్రీనివాస్‌, సిపిఎం నాయకుల ముచ్చర్ల త్రిమూర్తులు, పొగాకు పూర్ణ మాట్లాడారు. అంతకు ముందు ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

వీరవాసరం : సీతారాం ఏచూరి, ఆర్‌ఎస్‌ల జీవిత ఆశయాలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని సిఐటియు నాయకులు ఎం.ఆంజనేయులు, డి.వరలక్ష్మి, పి.నాగరత్నం అన్నారు. ఆదివారం వీరవాసరం, రాయకుదురులో సీతారాం ఏచూరి, ఆర్‌ఎస్‌ చిత్రపటాల ముందు పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో వామపక్ష అభ్యుదయ భావాలు, లౌకిక వాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై సీతారాం ఏచూరి చేసిన ఉపన్యాసాలు దేశ పౌరులకు ఉపయోగపడతాయని అన్నారు. శ్రమ చేసేవారు శ్రమకు తగ్గ ఫలితం అందాలంటే పాలకులు ఏం చేయాలో చెప్పగలిగే గొప్ప నాయకులని అన్నారు. మన జిల్లాలో రైస్‌ మిల్లు కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, అంగన్వాడీ, ఆశ వంటి స్కీం ఉద్యోగులు, దళితులు, గిరిజనులు ఉద్యమాలకు నాయకత్వం వహించి వారి కష్టసుఖాలలో భాగస్వామి అయిన ఆర్‌ఎస్‌ మహోన్నతమైన నాయకుడని అన్నారు. చావు, పుట్టుకల మధ్యన ఉండే జీవితం చాలా విలువైనదని దానిని ప్రజలకు అంకితం చేసి వారు జీవించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతి, నిర్మల, తులసి పాల్గొన్నారు.

➡️