ప్రజాశక్తి – భీమవరం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్న విద్యుత్ రుసుముల ప్రతిపాదనలపై ఎపి విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రెండో రోజు బుధవారం కొనసాగింది. స్థానిక ఇండిస్టియల్ ఏరియాలోని ఎస్‌ఇ కార్యాలయంలో వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఇ రఘునాథబాబు మాట్లాడుతూ విద్యుత్ రుసుములకు సంబంధించిన ప్రతిపాదనలపై ఎవరికివారు అభిప్రాయాలు తెలియజేయవచ్చన్నారు. అభిప్రాయాలు తెలిపే వారు ముందుగా పేర్లు రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. నలుగురు వినియోగదారులు పేర్లు నమోదు చేయించుకున్నట్లు తెలిపారు. ఇఇ ఎన్.వెంకటేశ్వరరావు, ఐస్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మంతెన ఆంజనేయరాజు, బిహెచ్.సత్యనారాయణరాజు, పివిఎస్.గోపాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.విద్యుత్ సెక్షన్ల పేర్లు మార్పు జిల్లాలోని విద్యుత్ సెక్షన్ల పేర్లలో మార్పులు చేసినట్లు ఎస్‌ఇ ఎ.రఘునాథబాబు తెలిపారు. ఇటీవల భీమవరం వచ్చిన సంస్థ సిఎమ్‌డి పృథ్వీతేజ్ సూచనల మేరకు వివిధ సెక్షన్లకు ఆయా ప్రాంతాల పేర్లు పెట్టినట్లు చెప్పారు. పాత, కొత్త పేర్ల వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు సూచన మేరకు నరసాపురం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న వీరవాసరం సెక్షన్‌ను భీమవరం నియోజకవర్గంలో చేర్చడంతోపాటు తాడేరు, పాలకోడేరు, వీరవాసరం సెక్షన్లతో కొత్తగా పాలకోడేరు సబ్‌డివిజన్ ఏర్పాటు చేశామన్నారు. పెనుగొండ సబ్‌డివిజన్‌ను ఆచంట నియోజకవర్గంలో చేర్చి ఆచంట సబ్ డివిజన్‌గా మార్పు చేసినట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం రూరల్ సబ్ డివిజన్ పేరును పెదతాడేపల్లిగా మార్పు చేసినట్లు చెప్పారు. భీమవరం డి1-ఇండిస్టీయల్ ఎస్టేట్, భీమవరం డి2-ఎఎస్‌ఆర్ నగర్, భీమవరం డి3-ప్రకాశం చౌక్, భీమవరం రూరల్-తాడేరు, నరసాపురం రూరల్-సీతారామపురం, ఆకివీడు రూరల్-గుమ్ములూరు, నరసాపురం టౌన్-నరసాపురం, పాలకొల్లు టౌన్-పాలకొల్లు, పాలకొల్లు రూరల్-పూలపల్లి, తాడేపల్లిగూడెం నార్త్- హౌసింగ్ బోర్డు కాలనీ, తాడేపల్లిగూడెం సౌత్-భాగ్యలక్ష్మిపేట, తాడేపల్లిగూడెం ఎస్‌ఎస్-పెంటపాడు, తాడేపల్లిగూడెం రూరల్-కుంచనపల్లి, తణుకు రూరల్-తేతలి, తణుకు టౌన్-తణుకు, తణుకు డి2-ఎన్‌జిఒస్ కాలనీగా పేర్లు మార్పు చేసినట్లు వెల్లడించారు.