పోరాటంతోటే మినీ స్టేడియం సమస్య పరిష్కారం

ప్రజాశక్తి – ఆకివీడు

దశాబ్ధాలుగా ఉన్న ఆకివీడు మినీ స్టేడియం సమస్య పరిష్కారానికి పోరాటమే పరిష్కారమని, అందుకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని వక్తలు సంయుక్తంగా పిలుపునిచ్చారు. డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక జెడ్‌పి హైస్కూల్‌ గ్రౌండ్లో సుందరయ్య క్రీడా ప్రాంగణంలో నిర్వహించే 42వ సంక్రాంతి యువజనోత్సవాల ముఖద్వారాన్ని ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్‌ పిబి.ప్రతాప్‌ కుమార్‌, సుందరయ్య క్రీడా ప్రాంగణాన్ని సంఘం అధ్యక్షులు మొహమ్మద్‌ మదనీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మదని అధ్యక్షతన సభ జరిగింది. అనంతరం మదనీ మాట్లాడుతూ సుమారు 42 సంవత్సరాలుగా డివైఎఫ్‌ఐతో కలిసి పయనిస్తూ క్రీడా ప్రాంగణాన్ని కోరుతూనే ఉన్నామని, అయినా ఏ ఒక్కరూ నిర్మాణానికి పూనుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువత క్రీడల ప్రోత్సాహానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారని వారి ప్రయత్నానికి అధికారులు కలిసి రావాలని ఆయన కోరారు. సభలో వైసిపి నాయకులు అంబటి రమేష్‌, వినియోగదారుల సంఘాల రాష్ట్ర సమాఖ్య సహాధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య, డివి రమణమూర్తి మాట్లాడుతూ మినీ స్టేడియం కోసం ఉద్యమించాల్సిందేనన్నారు. అందుకోసం రాస్తారోకోలు, ధర్నాలకు ముందుకెళ్దామన్నారు. డివైఎఫ్‌ఐ మాజీ అధ్యక్షులు బొక్కా సత్యనారాయణ మాట్లాడుతూ మాదకద్రవ్యాలను ప్రతి ఒక్కరూ తరిమికొట్టాలన్నారు. ఆహ్వాన సంఘం కన్వీనర్‌ డి.రవితేజ మాట్లాడుతూ క్రీడల పట్ల ప్రభుత్వానికి లక్ష్యం తగ్గిందన్నారు. విదేశీ సంస్కృతి పట్ల మోజు పెరుగుతోందని వాపోయారు. ఆహ్వాన సంఘ కోశాధికారి బొట్టుపల్లి రాంబాబు మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసి పేకాట, కోడిపందేలు, జూదాలు యథేచ్ఛగా సాగిస్తున్నారని తెలిపారు. ముందుగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గేదెల ధనుష్‌ పతాకావిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం పోటీలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

➡️