ప్రజాశక్తి – పెనుగొండ
అనారోగ్యంతో బాధపడుతున్న యువతి మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని సిద్ధాంతం గ్రామంలో చోటు చేసుకుంది. పెనుగొండ ఎస్‌ఐ కె.గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం… సిద్ధాంతం గ్రామానికి చెందిన ఈదుబిల్లి నాగలక్ష్మి దుర్గ (18) ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటుంది. కొంతకాలంగా ఆమె తరచూ గుండెనొప్పితో బాధపడుతుంది. గతంలో ఆమెకు గుండెకు సంబంధించి ఆపరేషన్ జరగ్గా మందులు వాడుతుంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా గుండె నొప్పి రావడంతో మనస్తాపానికి గురైన నాగలక్ష్మిదుర్గ ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి నాగ వెంకట పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
