వాణిజ్య కేంద్రం.. తాడేపల్లిగూడెం

జిల్లాలోని డెల్టా, మైదాన ప్రాంతాల ముఖద్వారంగా ఉంటమే కాక ఎప్పటి నుంచో జాతీయ స్థాయి వాణిజ్యానికి, ఇటీవల విద్యారంగానికి కేంద్రంగా మారింది తాడేపల్లిగూడెం. జల రవాణాకు ప్రాధాన్యత తగ్గిపోయి రోడ్డు రవాణా ప్రాముఖ్యత సంతరించుకున్న కాలం నుంచి తాడేపల్లిగూడెం అభివృద్ధి ప్రారంభమైంది. గూడెంలోని కాసు బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌ ద్వారా రాష్ట్రంలో, దేశంలోని పలు ప్రాంతాలకు ఉల్లిపాయలు, కూరగాయలు ఎగుమతి అవుతుంటాయి. దేశంలో అరుదైన ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో రెండోది వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. రానున్నకాలంలో దీన్ని పూర్తిస్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎన్నో ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌, వ్యవసాయ పాలిటెక్నిక్‌, బిఇడి వంటి వృత్తి విద్యా కళాశాలలు, పలు డిగ్రీ కళాశాలలతోపాటు ఆంధ్రా విశ్వవిద్యాలయ పీజీ కేంద్రం కూడా వెలసింది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రీయ విద్యాసంస్థ నిట్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) ఇక్కడే ఏర్పాటు చేశారు. గూడెంలో సాహిత్య కళాసంస్థలు సాహిత్యోపన్యాసాలు, హరికథలు, జాతీయ నాటిక పోటీలు సంగీతోత్సవాలు వంటి కార్యక్రమాల నిర్వహణతో కళాకేంద్రంగా విరాజిల్లుతోంది.నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం తాడేపల్లిగూడెం పట్టణం, పెంటపాడు మండలం, తాడేపల్లిగూడెం మండలం ఉన్నాయి. 2009 నాటికి గూడెం నియోజకవర్గంలో ఉన్న నిడమర్రు మండలాన్ని ఉంగుటూరు నియోజకవర్గంలో చేర్చారు. తణుకు నియోజకవర్గంలోని కృష్ణాయపాలెం, ఆరుళ్ల గ్రామాలను గూడెం పరిధిలో చేర్చారు.రేలంగి గూడెం వారే.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు తాడేపల్లిగూడెం నుంచి ఎదిగారు. సుప్రసిద్ధ హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్యది తాడేపల్లిగూడెమే. తన పేరు మీద పట్టణంలో సినీ ప్రదర్శనశాలను నిర్మించారు. ప్రముఖ రంగస్థల నటుడు మద్దాల రామారావు, సినీ దర్శకుడు కృష్ణవంశీ, హాస్యనటుడు ఐరన్‌లెగ్‌ శాస్త్రి, సినీనటి సుదీప, శిల్పి, పద్మశ్రీ గ్రహీత తాడేపల్లి వెంకన్న, కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు అమ్మనమంచి బలరామశాస్త్రి, సరస్వతులు హనుమంతరావు, కవి జంధ్యాల శాంతిశ్రీ వంటి వారు తాడేపల్లిగూడెం ప్రాంతం నుంచే పేరొందారు. సినీ కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి చాలాకాలం తాడేపల్లిగూడెంలో ఉద్యోగం చేశారు. ప్రసిద్ధ హిందీ సినీనటి రేఖ తల్లి గూడెంలో నివాసం ఉండేవారు.రాజకీయ విశేషాలు తాడేపల్లిగూడెం తొలి అసెంబ్లీ ఎన్నిక నియోజకవర్గం నాటికి అలంపురం నియోజకవర్గంలో ఉండేది. అనంతరం కాలంలో అలంపురమే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలంలో ఓ గ్రామంగా మిగిలింది. గూడెం పట్టణానికి చెందిన సాహితీవేత్త రాజకీయ ప్రముఖుడు పసల సూర్యచంద్రరావు ఉంగుటూరు నియోజకవర్గం నుంచి గెలుపొంది ఆంధ్రరాష్ట్రానికి తొలి అసెంబ్లీ ఉప సభాపతిగా వ్యవహరించారు. నేటికీ జిల్లా నుంచి ఉపసభాపతి బాధ్యతలు చేపట్టిన వారు మరెవరూ లేకపోవడం గమనార్హం. యర్రా నారాయణస్వామి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎగా గెలిచి వెంటనే వచ్చిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలుపొంది జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ అయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి జిల్లా పరిషత్తు ఛైర్మన్‌గా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ఈలి వెంకట సత్యనారాయణ గూడెం పురపాలక సంఘం ఛైర్మన్‌ పదవికి ఎన్నికై, రాష్ట్ర పురపాలక సభాధ్యక్షుల సమాఖ్య అధ్యక్షునిగా వ్యవహించారు. చింతలపాటి వర ప్రసాదమూర్తిరాజు, ఈలి ఆంజనేయులు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికై మంత్రి పదవులను అలంకరించారు. గూడెం మండలం మాధవరానికి చెందిన సమరయోధులు పత్తి శేషయ్య, పత్తి మణెమ్మ రాష్ట్రస్థాయిలో పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి ఈ గ్రామంలో ప్రతి ఇంటా కనీసం ఒకరైనా సైనికులుగా ఉంటున్నారు. మణెమ్మ పెనుగొండ నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎగా గెలుపొంది ఎన్‌టిఆర్‌ ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రిగా పదవి చేపట్టారు. తాడేపల్లిగూడెం ఎంఎల్‌ఎగా పనిచేసిన యర్రా నారాయణస్వామి శాసనమండలి సభ్యునిగా ఉండగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రిగా పనిచేశారు.ఎంఎల్‌ఎలుగా భార్యాభర్తలు ఒకే నియోజకవర్గంలో భార్యాభర్తలు ఎంఎల్‌ఎలుగా గెలుపొందడం అరుదైన విషయం. ఈలి కుటుంబంతో నియోజకవర్గానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈలి ఆంజనేయులు గూడెం పురపాలక సంఘం అధ్యక్షునిగా చేయడంతోపాటు రెండుసార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. ఆయన భార్య వరలక్ష్మి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచి ఎంఎల్‌ఎ పదవి చేపట్టారు. ఆంజనేయులు కుమారుడు ఈలి వెంకట సత్యనారాయణ గూడెం ఛైర్మన్‌గా, మరో కుమారుడు ఈలి వెంకట మధుసూదనావు(నాని) వైస్‌ ఛైర్మన్‌గా, ప్రతిపక్ష నేతగా, 2009 ఎన్నికల్లో పిఆర్‌పి తరఫున ఎంఎల్‌ఎగా గెలుపొందారు.రెండోసారి విజేతలు గూడెం నియోజకవర్గంలో ఉప ఎన్నికతో కలిపి 15 సార్లు ఎన్నికలు జరగ్గా నలుగురు నేతలు రెండుసార్లు ఎన్నికయ్యారు. 1962, 67లో అల్లూరి కృష్ణారావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందగా, 1972లో స్వతంత్ర అభ్యర్థిగా, 1983లో టిడిపి అభ్యర్థిగాను ఈలి ఆంజనేయులు విజయం సాధించారు. యర్రా నారాయణస్వామి 1985 మధ్యంతర ఎన్నికల్లో 1999 సాధారణ ఎన్నికల్లోనూ గెలుపొందారు. 1989, 1994 సాధారణ ఎన్నికల్లో పసల కనకసుందరరావు విజేతగా నిలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన ఈలి నాని అనంతర పరిణామాల్లో ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాగా కాంగ్రెస్‌ సభ్యునిగా కొనసాగారు. ఇటీవల కొట్టు సత్యనారాయణ, ఈలి నాని టిడిపిలో చేరారు.సంవత్సరం విజేత పార్టీ1955 నంబూరి శ్రీనివాసరావు కాంగ్రెస్‌1962 అల్లూరి కృష్ణారావు కాంగ్రెస్‌1967 అల్లూరి కృష్ణారావు కాంగ్రెస్‌1972 ఈలి ఆంజనేయులు స్వతంత్ర1978 మూర్తిరాజు కాంగ్రెస్‌1983 ఈలి ఆంజనేయులు టిడిపి1985 యర్రా నారాయణస్వామి (బెనర్జీ) టిడిపి1987 (ఉప) ఈలి వరలక్ష్మి కాంగ్రెస్‌1989 పసల కనకసుందరరావు టిడిపి1994 పసల కనకసుందరరావు టిడిపి1999 యర్రా నారాయణస్వామి టిడిపి2004 కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్‌2009 ఈలి వెంకట మధుసూదనరావు (నాని) ప్రజారాజ్యం2014 పైడికొండల మాణిక్యాలరావు బిజెపి2019 కొట్టు సత్యనారాయణ వైసిపి

➡️