ప్రజాశక్తి – పోడూరు
విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై మోపుతున్న రూ.20 వేల కోట్ల భారాలను తక్షణం రద్దు చేయాలని సిపిఎం పోడూరు శాఖా కార్యదర్శి కాకర వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడూరు మండల సొసైటీ వద్ద బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పిల్లి.ప్రసాద్ మాట్లాడుతూ కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ భరోసా ఇచ్చి నాలుగు నెలలకే ప్రభుత్వం ఛార్జీల మోత మోగిస్తోందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల్లో ఇంధన సర్దుబాటు ట్రూఅప్ ఛార్జీలు సెస్సులు రద్దు చేయాలన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని గతంలో వాడుకున్న కరెంట్‌కు నేడు బిల్లులు వేసే విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజానీకానికి ఇది పెనుభారంగా మారిందని వాపోయారు. షార్ట్ టర్మ్ కొనుగోలు పేరుతో గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించడం దారుణమన్నారు. ట్రూ అప్ ఛార్జీల భారాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొంతు శ్రీను, బూరాబత్తుల వెంకట్రావు, కె.శేషగిరిరావు, కుడిపూడి సత్యనారాయణ, కె.నాగేశ్వరరావు, టి.లక్ష్మణరావు, డేవిడ్ పాల్గొన్నారు.