ప్రజాశక్తి – నరసాపురం
ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థి బొర్రా గోపీమూర్తి మంగళవారం నరసాపురం పట్టణం, మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను, వైఎన్ కళాశాల, స్వర్ణాంధ్ర కళాశాలల్లో అధ్యాపకులను కలిశారు. రానున్న ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గోపీమూర్తి మాట్లాడుతూ ప్రజా సమస్యలు, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, ప్రయివేటు టీచర్స్, ప్రభుత్వ రంగ ఉపాధ్యాయుల సమస్యలపై సూటిగా ప్రశ్నించేది పిడిఎఫ్ ఎంఎల్‌సిలు మాత్రమేనన్నారు. తాను విద్యార్థి దశ నుండి ఎన్నో సమస్యల మీద పోరాడానని, ఉపాధ్యాయ ఉద్యమంలో పాల్గొంటూ ఉద్యోగులకు అండగా నిలిచానని చెప్పారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.మార్కండేయులు, అధ్యక్షులు పి.విజయరామరాజు, జిల్లా కార్యదర్శి పి.కృష్ణకుమార్, మున్సిపల్ కన్వీనర్ ఎం.లక్ష్మీనారాయణ, ఎన్‌వి.సత్యనారాయణ, ఎస్.అజరుకుమార్, ఎం.మాణిక్యాలరావు, చంద్రకుమార్, సిహెచ్. కృష్ణ మోహన్, పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.