సిహెచ్‌సిలో వైద్యుని ఖాళీ భర్తీ చేయాలి

పెనుగొండ : పెనుగొండలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎండి(డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌) పోస్ట్‌ ఖాళీను భర్తీ చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో గురువారం సిహెచ్‌సి వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సిహెచ్‌సి సూపరింటెండెంట్‌ జి.చంద్ర సావేరికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎండి(వైద్య నిపుణుడు) లేకపోవడంతో చాలా కేసులు తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించడం వల్ల రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆసుపత్రిలో గాయాలకు కట్లు కట్టేవారు లేని దుస్థితి నెలకొందన్నారు. పెనుగొండ గ్రామ శాఖా కార్యదర్శి ఎన్‌.గంగారావు మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో తక్షణం ఒక ఎండి, కట్లు కట్టే పనివారు 4 ఖాళీలు భర్తీ చేయాలని, ఫిజియోథెరపీ పరికరాలు ఉన్నా ఇప్పటివరకు డాక్టర్‌ను ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రయివేటు వారిని ఆశ్రయించవలసి వస్తుందని తెలిపారు. మండల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని డిమాండ్‌ చేశారు. 30 పడకల ఆసుపత్రిని 50 పడకలుగా ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.వెంకటేశ్వరరావు, మాదాసు నాగేశ్వరరావు, నీలాపు ఆదినారాయణ, రాజమహేంద్రవరపు వెంకటేష్‌, శీలం ఏసు పాల్గొన్నారు.

➡️