సరసమైన ధరలకు కూరగాయలు

జెసి రాహుల్‌ కుమార్‌ రెడ్డి

భీమవరం : టమాటాలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు వినియోగదారులకు సరసమైన ధరలకు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సివిల్‌ సప్లైస్‌, మార్కెటింగ్‌, హోల్‌సేల్‌ కూరగాయల వర్తకులతో సమావేశమై మాట్లాడారు. రోజురోజుకూ కూరగాయలు, ఉల్లిపాయల ధరలు అధికంగా పెరిగిపోవడం వినియోగదారులకు భారంగా మారిందని అన్నారు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు బల్క్‌గా కొనుగోలు చేసి నియోజకవర్గాల వారీగా మార్కెటింగ్‌ శాఖ ద్వారా అమ్మకాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే టమాటాలను లాభనష్టాలు లేకుండా హోల్‌సేల్‌ ధరకే అమ్మకాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హోల్‌ సేల్‌ వర్తకులు వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని స్థిరమైన ధరకు అమ్మేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి సునీల్‌ కుమార్‌, డిఎస్‌ఒ ఎన్‌.సరోజ, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ టి.శివరామ ప్రసాద్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు, ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️