ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
గ్రామాల అభివృద్ధికి వెన్నుముకగా నిలవాల్సిన పంచాయతీల్లో నిధుల ఖర్చుకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్త్తుతున్నాయి. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ తన శాఖను ప్రక్షాళ చేసి గ్రామీణ ప్రజలకు మరిన్ని సేవలందించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు పదేపదే చెబుతున్నారు. అధికారంలోకి వచ్చాక 15వ ఆర్థిక సంఘం నిధులు రెండు జిల్లాల్లోని పంచాయతీలకు రూ.వంద కోట్లకుపైగా వచ్చాయి. క్షేత్రస్థాయిలో మాత్రం ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల్లోని అభివృద్ధి పనులకు సక్రమంగా వినియోగించడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంచాయతీల ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రత్యేకంగా తెరిచిన ఇ-గ్రామస్వరాజ్‌లో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు ఇష్టానుసారంగా వెండర్ అకౌంట్లు తెరిచి నిధులు జమ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెండర్ ఖాతాలకు నిధుల జమపై గ్రామాల్లో విస్తృతమైన చర్చ నడుస్తోంది. నిడమర్రు మండలంలోని క్రొవ్విడి, మందలపర్రు, గుణపర్రు పంచాయతీలకు సంబంధించి ఇ-గ్రామస్వరాజ్ పోర్టల్‌లో తెరిచిన వెండర్ ఖాతాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ మూడు పంచాయతీలకు కార్యదర్శి ఒక్కరే. క్రొవ్విడి పంచాయతీలో మోటేపల్లి వెంకటలక్ష్మి ఉద్యోగి (ఎంప్లాయి) కింద వెండర్ ఖాతా ఉండగా, మందలపర్రు, గుణపర్రు పంచాయతీల్లో రెంటర్ (సిటిజన్), వెండర్ ఖాతాలు ఉన్నాయి. రావిపాటి మాధవీలత పేరు క్రొవ్విడిలో ఉద్యోగిగా, మిగిలిన రెండు పంచాయతీల్లో రెంటర్‌గా ఖాతాలు ఉన్నాయి. ఒక పంచాయతీలో ఉద్యోగి ఖాతాగా సొమ్ము జమవుతుండగా, మరో పంచాయతీలో రెంటర్ ఖాతాగా నిధులు జమవుతున్నాయి. ఒక వ్యక్తి ఒకచోట ఉద్యోగిగా, మరోచోట రెంటర్‌గా ఏవిధంగా ఉంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సదరు వ్యక్తులు క్రొవ్విడి పంచాయతీలో ఉద్యోగులుగా ఉన్నారా అనే విషయాలనుసైతం అధికారులు తేల్చాల్సి ఉంది. క్రొవ్విడి పంచాయతీలో మోటేపల్లి వెంకటలక్ష్మి వెండర్ ఖాతాలోకి దాదాపు రూ.పది లక్షలకుపైగా సొమ్ము 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో జమ కావడం ఆశ్చర్యం కల్గిస్తోంది. ఇంకా చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ ఉన్నట్లు ఇ-గ్రామస్వరాజ్ ఖాతాలో చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఇదేవిధంగా మందలపర్రు, గుణపర్రు పంచాయతీల్లోనూ నిధుల జమ సాగింది. గుణపర్రులో మోటేపల్లి వెంకటలక్ష్మి పేరున 2024 మార్చిలో రూ.24 వేలకుపైగా బిల్లు తాగునీటి కింద ఖర్చు పెడితే తిరస్కరణకు గురవ్వగా, ఏప్రిల్‌లో జీతాల పేరుతో బిల్లు పెట్టి క్లియర్ చేసుకున్నట్లు ఇ-గ్రామ స్వరాజ్ ఖాతాల్లో చూపిస్తోంది. క్రొవ్విడిలో ఉద్యోగిగా ఖాతా ఉన్న రావిపాటి మాధవీలతకు మందలపర్రు పంచాయతీ వెండర్ ఖాతాల్లో ఒకేసారి రూ.94,900 బిల్లు చెల్లింపు జరిగినట్లు చూపిస్తోంది. మరోవ్యక్తి రావిపాటి శ్రీనివాసరావు పేరున క్రొవ్విడిలో వెండర్ ఖాతా ఉంది. ఒకే ఇంటి పేరున ఉన్న వ్యక్తుల పేర్లపై వెండర్ ఖాతాలు ఉండటంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇ-గ్రామస్వరాజ్ వెండర్ ఖాతాలపై ఉన్నతాధికారులు విచారణ నిర్వహిస్తేనే అసలు విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పంచాయతీల్లో పలు అంశాలపై సమాచారం హక్కుచట్టం ద్వారా దరఖాస్తు చేసినా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితులు సైతం ఉన్నాయనే ఆరోపణలున్నాయి. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో తమకు అనుకూల వ్యక్తులు ఉన్నారని, తమకు ఏమీ కాదనే ధీమాతోనే వారు ఈ విధంగా ముందుకు సాగుతున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిపైనా ఉన్నతాధికారులు విచారించి పంచాయతీల్లోని ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగమయ్యాయో, లేదో తేల్చాల్సి ఉంది.వెండర్ ఖాతాలను తనిఖీ చేస్తారా? ఏలూరు జిల్లాలో 27 మండలాల్లో 547, పశ్చిమగోదావరిలో 20 మండలాల్లో 409 గ్రామ పంచాయతీలు వరకూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు విడతలుగా రెండు జిల్లాల్లోని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘంం నిధులు రూ.వంద కోట్లకుపైగా విడుదలయ్యాయి. పంచాయతీల్లో ఆ నిధులు ఏ పనులకు ఉపయోగిస్తున్నారో తనిఖీలు మాత్రం ఉండటం లేదు. వెండర్ ఖాతాలపై పంచాయతీల్లో తనిఖీలు నిర్వహిస్తే చాలా విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా పంచాయతీ అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకుంటారో, లేదో వేచిచూడాలి. ప్రతియేటా పంచాయతీల్లో ఆడిట్ ప్రక్రియ జరుగుతోంది. అక్కడ వెండర్ ఖాతాలను ఏవిధంగా గుర్తించలేదో అర్థం కావడంలేదు. వెండర్ ఖాతాలు నిబంధనల ప్రకారం ఉన్నాయో, లేదో కూడా తేల్చాల్సి ఉంది.