కేంద్ర మంత్రిగా వర్మ

Jun 9,2024 21:28

ప్రజాశక్తి – భీమవరం

కేంద్ర మంత్రి వర్గంలో జిల్లాకు మరోసారి చోటు దక్కింది. నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి ఎంపీగా ఎన్నికైన వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. గతంలో బిజెపికి చెందిన సినీ నటుడు కీర్తిశేషులు యువి.కృష్ణంరాజు నరసాపురం ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తూ కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. 2014 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా బిజెపికి చెందిన గోకరాజు రంగరాజు ఎన్నికయ్యారు. రాష్ట్రం నుంచి బిజెపి తరపున ఎంపీలుగా ఎన్నికైన వారిలో పురంధేశ్వరి, సిఎం రమేష్‌ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ వారందరినీ పక్కన పెట్టి వర్మకు కేంద్ర మంత్రి మండలిలో చోటు ఇవ్వడం గమనార్హం. శ్రీనివాసవర్మ బిజెపి జిల్లా అధ్యక్షులుగా పనిచేసి తరువాత రాష్ట్ర కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నారు. ఆయనకు భీమవరం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

➡️