సమాజ మార్పునకు ఐక్యంగా ఉద్యమించాలి

ప్రజాశక్తి – భీమవరం

అసమానతలు లేని సమాజం కోసం, ప్రస్తుత సమాజ మార్పుకోసం యువత, విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలని ఉత్తరాంధ్ర జిల్లాల మాజీ ఎంఎల్‌సి, డివైఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర నాయకులు ఎంవిఎస్‌.శర్మ పిలుపునిచ్చారు. స్థానిక త్యాగరాజు భవనంలో మంగళవారం డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన యువజనుల జిల్లాస్థాయి ఆత్మీయ సదస్సు నిర్వహించారు. సదస్సు ప్రారంభ సూచికగా జాతీయ పతాకాన్ని డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, సంఘ పతాకాన్ని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎస్‌విఎన్‌.శర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత స్వాతంత్రోద్యమంలో ప్రాణాలర్పించిన మహనీయులు, సంఘ సంస్కర్తలు, అంటరానితనంపై పోరాడిన యోధులకు, స్త్రీ విద్య కోసం పోరాడిన ధీర వనితలకు, సాంఘిక సంస్కర్తలకు, ఈ ప్రాంతంలో పుట్టి ప్రపంచస్థాయిలో విద్య, వైద్య సేవలందించి గుర్తింపు పొందిన విభిన్న ప్రతిభావంతుల చిత్రపటాలకు డివైఎఫ్‌ఐ పూర్వ రాష్ట్ర నాయకులు బి.బలరాం, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, మాజీ జిల్లా నాయకులు జెఎన్‌వి.గోపాలన్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎస్‌విఎన్‌.శర్మ, జిల్లా కార్యదర్శి జి.ధనుష్‌, ఉపాధ్యక్షులు బి.రాంబాబు, పిల్లి చంటిబాబు, తెన్నేటి స్టాలిన్‌, బి.బాలాజీ, శింగిరెడ్డి శేషు, ఆర్‌.రమేష్‌, పి.దుర్గ, ఎ.శ్రీదేవి అధ్యక్ష వర్గంగా సదస్సు నిర్వహించారు. ముఖ్య వక్తగా విచ్చేసిన శర్మ మాట్లాడుతూ యువజనులు చైతన్యం, దేశభక్తితో ఆదర్శ సమాజ నిర్మాణానికి మూల స్తంభాలుగా ఉండాలన్నారు. పాశ్చాత్య వ్యామోహాన్ని వీడి మాతృదేశంపై మమకారంతో అన్ని తరగతుల ప్రజల అభివృద్ధికి కంకణం కట్టుకుని దేశాభివృద్ధికి చిత్తశుద్ధి, ఐకమత్యం, పరస్పర సహకారంతో కృషి చేయాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని పిలుపునిచ్చారు. యువత అన్ని విషయాల్లో ధైర్యంగా తాము ఎంచుకున్న లక్ష్యాలను సాధించేందుకు పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై.రాము, జి.రామన్న మాట్లాడుతూ బ్రిటీషు పాలనాకాలంలో మన దేశం అన్ని రంగాల్లో దోపిడీకి గురైందన్నారు. ఇటువంటి వలస పాలనకు వ్యతిరేకంగా భారతీయులు చేసిన ఉద్యమమే జాతీయోద్యమమన్నారు. పరాయి పాలన నుండి విముక్తి చేసి స్వాతంత్రం కోసం విద్యార్థులు, రైతులు, యువజనులు, మహిళలు, గిరిజనులు ఇలా అన్ని తరగతుల ప్రజలు ఈ పోరాటంలో పాల్గొన్నారన్నారు. వారి పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రమన్నారు. జాతీయోద్యమాన్ని లేదా స్వాతంత్ర పోరాటక్రమాన్ని యువతీ, యువకులకు, విద్యార్థులకు వివరించే ప్రయత్నం ఈ సమావేశ ముఖ్యోద్దేశమని సూచించారు. సమావేశంలో ప్రజానాట్యమండలి కళాకారులు ఉత్తేజభరితమైన అభ్యుదయ గీతాలతో యువజనులను అలరించారు. పలు వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో యువజనుల ఆత్మీయ సదస్సు ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సదస్సులో డివైఎఫ్‌ఐ తాజా, మాజీ నాయకులు, యువతీ, యువకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

➡️