ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
వైఎస్‌ఆర్ హార్టీ కల్చరల్ యూనివర్శిటీ ఔట్ సోర్సింగ్ విధానంలో 6 నెలల క్రితం లంచాలిచ్చి ఉద్యోగాలు పొందిన సుమారు 25 మందిపై విచారణ జరిపామని, వారిని విధుల నుంచి తొలగిస్తామని ఎంఎల్‌ఎ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వెంకట్రామన్నగూడెంలోని యూనివర్శిటీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 2019 నుండి 2024 వరకూ గత ప్రభుత్వ అసమర్థత కారణంగా నిధులు లేక అభివృద్ధి కుంటుపడిందన్నారు. యూనివర్శిటీ ఉన్నత అధికారులు గత వైసిపి ప్రభుత్వ నాయకులకు అనుకూలంగా వ్యవహరించి యూనివర్శిటీని బ్రష్టు పట్టించారన్నారు. ఔట్సోర్సింగ్ విధానంలో అర్హతలేని కొంతమంది గత ప్రభుత్వ పెద్దలకు లంచాలిచ్చి ఉద్యోగాలు పొందారన్నారు. తక్షణం వారు విధుల నుంచి తప్పుకోవాలని లేనిపక్షంలో వారిపై కేసులు నమోదు చేసి విచారణ జరిపిస్తామని తెలిపారు. అలాగే ఫర్నీచర్ కొనుగోలుకు సుమారు రూ.కోటీ 50 లక్షలు ఖర్చు చేశారని దానిలో అవకతవకలు ఉన్నట్లు సమాచారం ఉందని దీనిపై కూడా విచారణ చేస్తామని తెలిపారు. కొత్త వంగడాలు, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.