‘పశ్చిమ’ విద్యాశాఖ రూటేవేరు..!

పోలింగ్‌ కేంద్రాల పాఠశాలకు 4న సెలవు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు బేఖాతర్‌

ప్రజాశక్తి – భీమవరం

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖ బేఖాతర్‌ చేసింది. పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలలకు పోలింగ్‌ ముందు రోజు 4వ తేదీన, పోలింగ్‌ రోజు ఐదో తేదీన సెలవు ప్రకటించాలంటూ ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను తుంగలోతొక్కింది. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఉపఎన్నికకు సంబంధించి జిల్లా విద్యాశాఖ వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఏర్పాటు చేసిన 20 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన పాఠశాలలకు ఎటువంటి సెలవు ప్రకటించకుండా నాలుగో తేదీన యథావిధిగా తరగతులు కొనసాగించిన పరిస్థితి నెలకొంది. బుధవారం ఎన్నికల సిబ్బంది, పోలీసులు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నా తరగతులు కొనసాగుతుండడంతో ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. తమకు సెలవు ప్రకటనపై అధికారుల నుంచి ఆదేశాలు రాలేదని స్కూల్‌ ఉపాధ్యాయులు చెప్పడంతో ఎన్నికల సిబ్బంది విస్తుపోయిన పరిస్థితి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల కమీషన్‌ ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికలు ఆరు జిల్లాలో జరుగుతుండగా, పశ్చిమలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించిన పరిస్థితి నెలకొందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జిల్లా విద్యాశాఖ తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయులకు సెలవు ఉత్తర్వులపైన ఆఖరు వరకూ గందరగోళమే.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి పోలింగ్‌ సందర్భంగా ఈ నెల ఐదో తేదీ పోలింగ్‌ రోజు ప్రభుత్వ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవు ఇవ్వాల్సి ఉంది. ఎన్నికలు జరుగుతున్న మిగిలిన ఐదు జిల్లాల్లోనూ మంగళవారం సాయంత్రమే సెలవుకు సంబంధించిన ఉత్వర్వులను జిల్లా విద్యాశాఖ అధికారులు జారీచేశారు. ఆ ఉత్వర్వుల్లో ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఓటర్లకు వెసులుబాటు కల్పించాల్సిందిగా పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమర్‌ ప్రసాద్‌ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ మంగళవారం అందుకు సంబంధించిన ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఈ ఆదేశాలను పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారులు తుంగలోతొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉపాధ్యాయులకు సెలవు ఉత్వర్వులు జారీచేయాలంటూ ఉపాధ్యాయ సంఘం నేతలు అధికారులను కలిసి విన్నువించుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. బుధవారం సాయంత్రానికి మెసెజ్‌ రూపంలో ఉపాధ్యాయులకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించి మమ అనిపించారు. ఎన్నికలు జరుగుతున్న అన్ని జిల్లాల్లో కంటే పశ్చిమలోనే అత్యధికంగా 3,729 మంది ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ ఉప ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాల్సిన విద్యాశాఖ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌ బూతులు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో సెలవు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఆదేశాలను పాటించకుండా ఒంటెద్దు పోకడగా వ్యవహరించడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

➡️