కౌలు కార్డులుఇచ్చేదెప్పుడు..!

నేటికీ ప్రారంభం కాని ప్రక్రియ

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

ఖరీఫ్‌ సీజన్‌ కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. రైతులు విత్తనాల కొనుగోలు వంటి ప్రక్రియను చేపట్టారు. కౌలు ఒప్పందాలు సైతం దాదాపు పూర్తయ్యాయి. కౌలురైతుల గురించి మాత్రం ప్రభుత్వం మరిచిపోయినట్లు కన్పిస్తోంది. ఇప్పటికీ కౌలుకార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించకపోవడం అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు మూడు లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. ఖరీఫ్‌లో నాలుగు లక్షల ఎకరాలకుపైగా వరిసాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యవసాయ సాగులో 70 శాతానికిపైగా కౌలురైతులే సాగు చేస్తున్నారు. వ్యవసాయ సాగులో కీలక పాత్ర పోషిస్తున్న కౌలురైతుల పట్ల ప్రతియేటా ప్రభుత్వం చిన్నచూపే చూస్తోంది. వైసిపి ప్రభుత్వం వచ్చాక కౌలురైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. కౌలుదారులకు సంబంధించిన ‘2011 భూ అధీకృత సాగుదారుని చట్టం’ను వైసిపి సర్కార్‌ మార్చేసింది. 2011 చట్టంలో భూయజమానితో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి భూములు కౌలుకు చేస్తున్న రైతులను గుర్తించి కౌలుకార్డులు జారీ చేయాలనే నిబంధన ఉంది. వైసిపి ప్రభుత్వం తెచ్చిన 2019 పంట సాగుదారుని హక్కు చట్టంలో భూయజమాని అంగీకారంతోనే కౌలుకార్డులు జారీ చేయాలని కొత్త నిబంధన తెచ్చింది. కౌలుదారులకు రుణార్హత కార్డులు ఇచ్చేందుకు భూయజమానులు అంగీకరించడం లేదు. దీంతో గడిచిన ఐదేళ్లుగా కౌలురైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. రెండు జిల్లాల్లో మూడు లక్షల మంది కౌలురైతులు ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏలూరు జిల్లాలో 57 వేల కౌలుకార్డులు, పశ్చిమగోదావరిలో 85 వేల మందికి మాత్రమే కౌలుకార్డులు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో దాదాపు మరో లక్షా 50 వేల మందికిపైగా కౌలురైతులకు కౌలుకార్డులు అందనే లేదు. దీంతో కౌలురైతులకు బ్యాంకుల నుంచి పంటరుణాలుగాని, దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారం, బీమా వంటివి సైతం అందని పరిస్థితి ఏర్పడింది. కార్డులు ఇచ్చిన రైతులకు కూడా అరకొర రుణాలు మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు. కౌలుకార్డులు లేకపోవడంతో పండించిన పంటను సైతం భూయజమాని పేరుపైనే అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. దీంతో గడిచిన ఐదేళ్లుగా కౌలురైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.నేటికీ ప్రారంభం కాని ప్రక్రియ కౌలుకార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్‌ మూడోవారం నుంచే అధికారులు ప్రారంభించేవారు. గ్రామసభలు ఏర్పాటు చేసి కౌలురైతులను గుర్తించేవారు. భూయజమానులకు అవగాహన కల్పించే ప్రక్రియ చేపట్టేవారు. ఈ ఏడాది ఎన్నికలు రావడంతో ఇప్పటి వరకూ కౌలుకార్డులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాలేదు. జూన్‌ రెండోవారం నుంచి ఖరీఫ్‌ నారుమడులు ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. సాగుచేసే రైతులకు కౌలుకార్డులు జారీచేసి బ్యాంకులు రుణాలు అందిస్తేనే కౌలురైతులకు మేలు జరుగుతుంది. లేకపోతే ప్రయివేటు వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. గతంలో జారీ చేసిన కౌలుకార్డులను రెన్యువల్‌ చేయడంతోపాటు, కొత్త కార్డుల జారీ ప్రక్రియ చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంది. అంతేకాకుండా భూయజమానితో సంబంధం లేకుండా వాస్తవ సాగుదారులకు కౌలుకార్డులు జారీ చేయాలి. ఎన్నికల నేపథ్యంలో కౌలురైతులను పూర్తిగా గాలికి వదిలేస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి. అదే జరిగితే ఈ ఏడాది కౌలురైతులకు అన్యాయం చేసినట్టే అవుతోంది.

➡️