పాలకొల్లు : యువత ఉన్నత చదువులు చదివి దేశానికి, రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. స్థానిక ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జరిగిన ఫ్రెషర్స్ డే లో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు చదువును కొనే వాళ్లమని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పుణ్యమా అని ఉచితంగా చదువు కుంటున్నామన్నారు. కార్పొరేటు కళాశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని, యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ముందుచూపుతో తన ఆస్తిని అమ్మి, కళాశాలలు స్థాపించి వేలాది మందికి యువతకు విద్యను అందించారన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజరాజేశ్వరి, అధ్యాపకులు, నాయకులు జివి, పెచ్చెట్టి బాబు పాల్గొన్నారు.