ప్రజాశక్తి- కడప ప్రతినిధి టిడిపి అధికారంలోకి వస్తే గండికోట నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లిస్తాం. ఇదీ 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి అధ్యక్షుని హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనల సందర్భంగా అన్న మాటలివి. చంద్రబాబు ఇచ్చిన హామీలను ఆసరా చేసుకుని టిడిపి అభ్యర్థి భూపేష్‌రెడ్డి ఏకంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. టిడిపి ఆశించిన మేరకు కూటమి అభ్యర్థులుగా పార్లమెంట్ తరుపున భూపేష్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలవడం, ఎంపీగా గెలుపు సమీపానికి రావడం ఆశ్చర్యపరిచింది. గండికోట నిర్వాసితుల పరిహారం చెల్లింపుల విషయంలో నిర్వాసితుల్లో ఆసక్తి నెలకొంది. గండికోట రిజర్వాయర్ రాయలసీమకే కలికితురాయి. ప్రాధాన్యత కలిగిన రిజర్వాయర్ నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన త్యాగధనులు నిర్వాసితులు. నిర్వాసితులను నిర్లక్ష్యం చేయడం పాలకులకు పరిపాటిగా మారింది. 2018 ఆగస్టులో టిడిపి సర్కారు గండికోట నిర్వాసితులకు రూ.6.75 లక్షల చొప్పున పరిహారం చెల్లింపులు చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్ తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే గండికోట నిర్వాసితులకు అదనంగా రూ.3.25 లక్షలను కలిపి రూ.10 లక్షల వరకు చెల్లింపులు చేస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన హామీ మేరకు గత ఐదేళ్లుగా సుమారు 999 పిడిఎఫ్‌లకు రూ.454 కోట్లు చెల్లింపులు ఆచరణ దిశగా అడుగులు పడలేదు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపు పరిధిలోనికి వచ్చిన సంగతి తెలిసిందే. వీటి పరిధిలో 17,809 నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. ప్రతి నిర్వాసిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రూ.1800 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంది. 16,800 పిడిఎఫ్‌లకు రూ.10 లక్షల చొప్పున రూ.1346 కోట్లు పరిహారం చెల్లించినట్లు సమాచారం. మిగిలిన 999 పిడిఎఫ్‌లకు రూ.454 కోట్ల చెల్లింపులకు దశాబ్దాల తరబడి నిర్వాసితులు ఎదురు చూడాల్సిన దుస్థితి దాపురించింది. ఇందులో ఫేజ్-1 కింద అప్పటి సిఎం హామీ కింద రూ.295 కోట్లు, మిస్సింగ్ పిడిఎఫ్‌లకు రూ.46 కోట్లు, ఫేజ్-2 కింద కొండాపురం గ్రామానికి రూ.53 కోట్లు, ఫేజ్-3 కింద రూ.999 పిడిఎఫ్‌లకు రూ.56 కోట్లు చొప్పున రూ.454 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ జగన్ గండికోట నిర్వాసితులకు రూ.6.75 లక్షలకు అదనంగా 3.25 లక్షల చెల్లిస్తామని హామీ నిచ్చారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇచ్చిన హామీని అరకొర చెల్లింపులు చేసి మిగిలిన నిర్వాసితులను విస్మరించారు. గండికోట నిర్వాసితులకు రూ.110 కోట్లతో 18 కాలనీలకు రూపకల్పన చేశారు. రూ.100 కోట్లతో 11 నిర్వాసిత కాలనీలను పూర్తి చేశారు. రూ.35 కోట్లు బిల్లుల్ని అప్‌లోడ్ చేశారు. మరో రూ.25 కోట్ల మేర పనులు చేపట్టాల్సి ఉంది. మొత్తం 18 నిర్వాసిత కాలనీల్లో ఎనిమిది కాలనీలు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందిన కూటమి ఎమ్మెల్యేలపై గండికోట నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనల సందర్భంగా, ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టిడిపి పార్లమెంట్ అభ్యర్థిగా పాదయాత్ర సాగించిన సి.భూపేష్‌రెడ్డిపై గండికోట నిర్వాసితుల పరిహారం చెల్లింపులపై ఇచ్చిన హామీలను అమలు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు.
