ప్రజాశక్తి – సాలూరురూరల్ : గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొనుగోలు దారులు కూరగాయలు కొనేందుకు బజారుకు వెళ్తే రూ.500 పెట్టినా కనీసం చేతి సంచి కూడా నిండకుండా ఉండడంతో చాలా అవస్థలు పడుతున్నారు. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు ఇలా ఉంటే ఏ కూరగాయని కూడా తినలేము, కొనలేమని సామాన్యులు వాపోతున్నారు. ఈ సంవత్సరం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు వల్ల కూరగాయల పంటలపై ప్రభావం చూపింది. దీని విస్తీర్ణంతో పాటు దిగుబడి కూడా తగ్గింది. దీంతో కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. రవాణా చార్జీలు కూడా అధిక అవుతుండడంతో వీటన్నింటికీ కలిపి ధరలు అధికమవుతున్నాయని కూరగాయల వ్యాపారులు చెపుతున్నారు. మరో పక్క ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ, సంక్షేమ వసతి గృహాల్లో గల విద్యార్థులు, గర్భిణుల పోషకాహారం మీద ప్రభావం చూపుతుంది. పెరిగిన ధరల వల్ల ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం సరైన పౌష్టికాహారం అందించలేకపోతున్నారు. కూరగాయలు కొనలేక అరకొరగానే విద్యార్థులకు, గర్భిణీలకు వండి పెడుతున్నారు.సెంచరీ కొట్టిన టమాటోనిత్యం అన్ని వంటల్లో వాడే టమోటో కిలో వంద రూపాయలు దగ్గరకు చేరుకోవడంతో సామాన్యుడు టమోటాను మార్కెట్‌లో ముట్టలంటే షాక్ కొట్టినంత పనిఅవుతుంది. సాలూరు పరిసరాల్లోని రామభద్రపురం, సాలూరులో ప్రతి రోజూ వివిధ ప్రాంతాల నుండి కూరగాయలు వస్తుంటాయి. బెండకాయలు, కాకరకాయలు, బీరకాయ, పచ్చి మిరప, కేరట్, బీట్ రూట్‌లు కిలో 60 నుంచి 70 రూపాయిలు ఉండగా, చిక్కుడు, క్యాలీఫ్లవర్ కిలో 80 నుండి వంద రూపాయిలు ధర పలుకుతుంది. ఉల్లి ధర అయితే రోజు రోజుకు పెరుగుతూనే వుంది. ముఖ్యంగా కూరగాయలు ఈ ప్రాంతంలో అరకొర మాత్రమే రైతులు పండించడంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ మార్కెట్‌కు రావడం వల్ల రవాణా చార్జీలతో కలిసి సామాన్యుడుపై అధిక భారం పడుతుంది. దీనికి తోడు ఇక్కడ దళారులు కృత్రిమ కొరతను సృష్టించడంతో కూరగాయలను ముట్టుకోవాలంటేనే భయంవేస్తుందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ దళారులను అదుపుచేసి సామాన్యులు కూరగాయలను కొనుగోలు చేసేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
