నిలిచిపోయిన రోడ్డు నిర్మాణం పనులు ఎప్పుడు పూర్తి అయ్యేనో!

Dec 26,2024 16:25 #roads

ప్రజాశక్తి – వేంపల్లె (కడప) : గత ప్రభుత్వ పాలనలో మంజూరు అయి నిలిచి పోయిన రోడ్డు నిర్మాణం పనులు ఎప్పుడు పూర్తి అవుతాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నిలిచిపోవడంతో ఆ పనులను దసరా, దీపావళి తర్వాత ప్రారంభిస్తామని కూటమి నేతలు గొప్పలు చెప్పారు. కాని రోడ్డు పనులు ప్రారంభం అనేది దసరా, దీపావళి పోయి సంక్రాంతి వస్తున్నా రోడ్డు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. పనులు ప్రారంభం కాక పోవడంతో ప్రజలు, వాహనదారులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. కూటమి నేతలు రోడ్డు పనులు చేసేందుకు పట్టించుకున్న పాపాన పోలేదు. వేంపల్లెలోని కడప – పులివెందుల – గండి రోడ్డును వెడల్పు చేయడానికి గత వైసిపి ప్రభుత్వంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో హడావిడిగా వేంపల్లెలో నాలుగు లైన్లుల రహదారి, డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టడం జరిగింది. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం మారడంతో రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు రోడ్డు పనులు అర్ధాంతరంగా వదిలేయడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేంపల్లె పట్టణంలో రవాణా వేగాన్ని తగ్గించడానికి కడప – పులివెందుల, గండి రోడ్డుకు సంబంధించి రూ 60.05 కోట్ల వ్యయంతో 4.2 కిలోమీటర్లు మేరకు సిమెంట్ రోడ్డు పనులు చేసేందుకు గత వైసిపి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వేంపల్లె పట్టణంలో చేపట్టిన నాలుగు లైన్లు సిమెంట్ నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత వైసిపి ప్రభుత్వ పాలనలో రోడ్డు పనులను సిమెంట్ రహదారి 15 మీటర్లుకు గాను. రాకపోకలు సజావుగా సాగడానికి ఒక వైపు 75 మీటర్లు రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. పులివెందుల రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 4.2 కిలోమీటర్లు గాను దాదాపు ఒక వరుస రహదారిని పులివెందుల ఎన్టీఆర్ సర్కిల్ సమీపం నుంచి శ్రీరామ్ పైనాన్స్ వరకు రహదారి నిర్మాణం చేపట్టారు. నిర్మించిన రహదారిలో కూడా అక్కడక్కడ పనులు నిలిపేశారు. మరోపక్క కంకర మాత్రం పరిచి పనులు నిలిపి వేయడం జరిగింది. దాదాపుగా 7నెలలు నుండి రహదారి పనులు జరగక పోవడం వలన కంకర పరిచిన రహదారిలో పిచ్చి మొక్కలు, కంప చెట్లు మొలిచాయి. ఇప్పటి వరకు సుమారు 1.490 మీటర్లు ఒక వైపు రహదారిని నిర్మించారు. ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో గుంతల్లో వాహనాలు నడపలేక దుమ్ము దూళితో వేంపల్లె పట్టణ వాసులు కాలుష్య బారిన పడుతున్నారు. దీంతో శ్వాసకోశ సమస్యలు ఎదరువుతున్నాయి.
చిన్నపాటి వర్షం కురిసనప్పుడు, నీరు గోతుల్లో నిలిచి వాహనాలు వెళ్లే సమయంలో పాదచారులపై నీరు చిమ్ముతుంది. అలాగే వాహనాలు ప్రమాదానికి గురి అవుతున్నాయి. రోడ్లు గుంత లాగా మారడంతో వాహన దారులు అసంపూర్తిగా నిలిచి పోయిన రహదారిలో ప్రయాణించాలంటే జంకు తున్నారు. ప్రధాన రహదారి వేంపల్లె పట్టణంలోని పులివెందుల నుంచి కడప రోడ్డులో గుంతలు గోతులుగా ఏర్పడ్డాయి. వాహనదారులు పులివెందుల, కడప రోడ్డున వెళ్లాలంటే ఇతర వీధి మార్గంలో ఉన్న మంచి రోడ్డును వెతుక్కుంటూ పోవాల్సివస్తుంది. కడప – పులివెందుల రోడ్డులో 40 శాతం పనులు జరగా, గండి రోడ్డులో 20 శాతం పనులు కూడ జరగలేదు. కడప – పులివెందుల రోడ్డు మార్గంలో రోడ్డు పనులు చేసేందుకు 47 కోట్లు మంజూరు కాగా, గండి మార్గంలో రోడ్డు పనులు చేసేందుకు 13.05 కోట్లు ఎండి ఆర్, ఎస్ హెచ్ కింద నిధులు విడుదల అయ్యాయి. కాంట్రాక్టర్ కు కూటమి ప్రభుత్వం రూ 7కోట్లు నిధులు కూడ మంజూరు చేసింది. అయినప్పటికీ పనులు జరగక పోవడం వలన ఈ దారిలో చిన్నవాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. కూటమి నేతలు సంక్రాంతి పండుగ తర్వాతనైనా ఇచ్చిన మాట ప్రకారం పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

➡️