గెలుపుపై.. ఎవరి ధీమా వారిదే..

ప్రజాశక్తి – రాయచోటి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సోమవారం ముగిసింది. జూన్‌ 4న కౌంటింగ్‌, అదే రోజు ఫలితాలు వెలబడునున్నాయి. బరిలో నిలిచిన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు గెలుపు దిశగా ఎవరు అంచనాలు వారు వేసుకుం టున్నారు. అన్నమయ్య జిల్లాలో రాజంపేట పార్లమెంట్‌, రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 14,26,834 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,00,380, స్త్రీలు 7,26,327, ట్రాన్స్‌ జెండర్స్‌ 127 మంది ఓటర్లు ఉన్నారు. అయితే పురుషులు 5,43,133 స్త్రీలు 5,67,350 ట్రాన్స్‌ జెండర్స్‌ 49 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 77. 83 శాతం పోలింగ్‌ నమోదయింది.పోలింగ్‌ బూత్‌లు వారీగా అభ్యర్థుల దష్టి టిడిపి, వైసిపి, ఇతర పార్టీలు పోలింగ్‌ బూత్‌ల వారీగా పోలైన ఓట్లను లెక్కలు వేసుకుంటున్నారు. వీటి ఆధారంగా గెలుపు, ఓటమి, మెజారిటీలను లెక్కలు వేసుకుంటున్నారు. ఈసారి పోలింగ్‌ శాతం పెరగడంతో ఎవరికి వారు తమకు అనుకూలంగా లెక్కలు వేసుకుంటున్నారు. అభ్యర్థుల భవితవ్యం ఇవిఎంలలో ఉంది. గెలుపుపై ఇరు పార్టీ నాయకులు ధీమాగా కనిపిస్తున్నారు. ఈ సారి భారీ మెజార్టీలు పెద్దగా ఉండవని ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతోని గెలుస్తారని చర్చలు బలంగా వినిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా రాజంపేట పార్లమెంటును బిజెపి పార్టీకి కేటాయించారు. దీంతో రాజంపేట పార్లమెంటు, కొన్ని అసెంబ్లీ స్థానాలపై టిడిపి ఆశల వదులుకోవాల్సి వస్తుందని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. బెట్టింగులు జోరు ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల కోసం జిల్లాలో క్రికెట్‌ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో 1 పార్లమెంట్‌, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించారు. బెట్టింగ్‌ రాయుళ్లకు పెద్ద పండగలా నిర్వహించుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని సొమ్ము చేసుకుంటున్నారు. కోడిపందెల తరహాలో ఎన్నికల ఫలితాలు మెజారిటీ బెట్టింగులు భారీగా నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది, ఎన్ని సీట్లు ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఏ మండలంలో ఎవరికి మెజార్టీ వస్తుంది, ఏ గ్రామంలో ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది, పలు అంశాల పలు కోణాలలో కోట్ల రూపాయల బెట్టింగులు జోరుగా నిర్వహిస్తున్నారు.

➡️