ఎవరి ధీమా వారిది

May 15,2024 22:07

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఓట్ల పండగ ముగిసింది. ఇక ప్రజాతీర్చే మిగిలింది. మరో 18 రోజులు తీర్పు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి అవిశ్రాంతంగా పనిచేసిన రాజకీయ పార్టీల నేతలు, అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. పోలింగ్‌ ముగియడంతో ఓటింగ్‌ సరళిపై నాయకులంతా లెక్కల్లో మునిగి తేలారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా పోలైన ఓట్లు, అనుకూల, ప్రతికూల ఓట్లపైనా ఆరా తీస్తున్నారు. కూడికలు, తీసివేతలతో ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లు సాగిన అధికార వైసిపి, టిడిపి కూటమి పోరులో విజయం ఎవదరిదనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఇక ఎన్నడూ లేనంతగా నియోజకవర్గంలో 71.84 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 19,672 ఓట్లు, పోస్టల్‌బ్యాలెట్‌ 4201 ఓట్లు అదనంగా పోలయ్యాయి. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో చెదురుమదరు ఘటనలు మినహా నియోజకవర్గంలో 260 కేంద్రాల్లో అంతటా ప్రశాంతంగా జరిగింది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు నిరీక్షించి మరీ ఓటర్లు ఓటేశారు. అసెంబ్లీకి 15 మంది పోటీచేశారు. అయితే ప్రధానంగా అధికార వైసిపి అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి, టిడిపి అభ్యర్థి పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు, స్వతంత్ర అభ్యర్థి మీసాల గీత మధ్య పోటీ నెలకొంది. గతంలో పోలిస్తే పెరిగిన ఓట్లతో తమకే అనుకూలిస్తుందని అభ్యర్థులు వరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము అందించిన సంక్షేమ పధకాలే తమను గెలిపిస్తాయని అధికార పార్టీ నేతలు చెబుతుండగా, వైసిపి ప్రభుత్వ అవినీతి, దౌర్జన్యం సహించలేక ఓటర్లు తమవైపే మొగ్గుచూపారంటూ ఎన్‌డి కూటమి అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. నియోజకవర్గంలో పెరిగిన ఓటింగ్‌ శాతం తమదేనని, ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక కోలగట్ల వీరభద్రస్వామి విజయం తమదేనని ధీమాగా ఉన్నారు. ఇండియా కూటమి నుంచి సుంకరి సతీష్‌ సైతం ఓటింగ్‌ సరళిని అంచనా వేసి ఎన్ని ఓట్లు వస్తాయని అంచనా వేసుకునే పనిలో ఉన్నారు. అయితే విజయం ఎవరిదో వచ్చేనెల 4వరకు వేచి ఉండాల్సిందే.

➡️