బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదు

Jan 10,2025 21:39

సోషల్‌ ఆడిట్‌లో డ్వామా పీడీ

ప్రజాశక్తి – మక్కవ : మండలంలోని ఉపాధి హామీ పనులకు సంబంధించిన బోర్డులను పని చేసిన చోట ఎందుకు ఏర్పాటు చేయలేదని సిబ్బందిపై డ్వామా ప్రాజెక్టు అధికారి కె.రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన ఉపాధిహామీ పనులపై శుక్రవారం సామాజిక తనిఖీ డ్వామా పీడీ రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగింది. 18వ విడత సామాజిక తనిఖీలో 2141 పనులకు రూ.22,33,14,386 ఖర్చులపై తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు చేసిన పలు తప్పిదాలు, మస్తర్ల దిద్దుబాట్లు, వేలిముద్రలు వేయకపోవడం, పని చేసే ప్రదేశంలో నేమ్‌ బోర్డులు లేకపోవడాన్ని తనిఖీ సిబ్బంది గుర్తించింది. 121 బోర్డులకు పడిన నగదు మొత్తం రూ.4,88,100కు గానూ సిఆర్‌డి అకౌంటుకు రూ.2,56,400 మాత్రమే జమ చేశారు. మిగితా సొమ్మును ఫీల్డ్‌ అసిస్టెంట్ల పేరున జమ కావడంపట్ల పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తుల పనులను పక్కా నిర్వహించాలన్నారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మావుడి శ్రీనివాసరావు, ఎపిడి శ్రీహరి, ఎంపిడిఒ డిడి స్వరూపారాణి, ఎపిఒ ఈశ్వరమ్మ,ఉపాధి హామీ సిబ్బంది ఆయా పంచాయతీల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

➡️