దీక్షల్లో మాట్లాడుతున్న సుబ్బరావమ్మ
ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరాయి. బుధవారం దీక్షలను ఎపి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ సందర్శించి మాట్లాడారు. జిల్లాలో 39 వర్కర్స్, 66 హెల్పెర్స్ మొత్తం 105 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ చేయాలని ఏడాదిగా ఐసీడీఎస్ అధికారులకు, కలెక్టర్‌కు అనేసార్లు వినతి పత్రాలిచ్చినా సమస్య పరిష్కరించకపోవడం వల్లే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని అన్నారు. హెల్పర్ ప్రమోషన్లకు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఏడాదైనా ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదని చెప్పారు. గుంటూరు జిల్లా మినహా మిగతా రాష్ట్రమంతటా ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినా ఇక్కడ మాత్రం చేపట్టకపోవటానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఇద్దరు ముఖ్యమైన మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లాలో ఉన్నా అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. పెద్ద ఎత్తున అంగన్‌వాడీ పోస్టులు ఖాళీగా ఉంటే ఈ వ్యవస్థ ఏ విధంగా ముంందుకు వెళుతుందని ప్రశ్నించారు. ఖాళీలు భర్తీ చేయకపోవటం వల్ల పనిభారం పెరుగుతుందన్నారు. జిల్లాలో అనేకచోట్ల అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల్లేక ఇబ్బందులు పడుతున్నారని, కాండిమెంట్స్, ఈవెంట్స్ డబ్బులు రాలేదని తెలిపారు. సమ్మె కాలపు హామీలకు సంబంధించి జీవోలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. సమ్మె ఒప్పందాలు అమలు చేయకపోవటం వల్ల ఈ సంవత్సర కాలంలో మరణించిన, రిటైర్డ్ అయిన అంగన్‌వాడీలకు పరిహారం అందలేదని తెలిపారు. అంగన్వాడీలకి ఇచ్చిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులు తమ విధులు నిర్వహణ కంటే నిరుద్యోగులపై బెదిరింపులుగా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని, తక్షణమే రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. దీక్షలకు యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎవిఎన్ కుమారి అధ్యక్షత వహించగా కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ, జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు డి.లక్ష్మీనారాయణ, కార్యదర్శి బి లక్ష్మణరావు, ఫిరంగిపురం మండల కార్యదర్శి ఎస్.కె.మస్తాన్‌వలి, తాడేపల్లి డివిజన్ కార్యదర్శి వి.దుర్గారావు, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎస్.కె.బాష, ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి లక్ష్మి, పంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ జిల్లా కార్యదర్శి సిహెచ్.శ్రీనివాసరావు, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దీప్తి మనోజ, వెంకాయమ్మ, హేమలత హాజరై మద్దతుగా మాట్లాడారు.కలెక్టర్‌కు వినతి…దీక్షల అనంతరం ఖాళీల భర్తీ, ఇతర అంగన్వాడీల సమస్యలపై జిల్లా కలెక్టర్‌తో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, యూనియన్ నాయకులు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐసిడిఎస్ పీడీతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
కలెక్టర్‌కు సమస్యలు వివరిస్తున్న కెఎస్ లక్ష్మణరావు, నాయకులు