రేషన్‌ డీలర్ల ఎంపికలో ఎందుకీ తిరకాసు?

Feb 2,2025 20:50

ప్రజాశక్తి – పార్వతీపురం : జిల్లాలో రేషన్‌ డీలర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేయడంలో జిల్లా అధికారులు తిరకాసు ప్రదర్శించారు. ఎంపికైన అభ్యర్థుల పేర్లను నేరుగా ప్రకటించకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. ఎపిపిఎస్సీ, యుపిపిఎస్సీ నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదల చేసిన చందంగా రేషన్‌ డీలర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను హాల్‌ టికెట్ల నెంబర్లతో విడుదల చేయడం విడ్డూరంగా ఉంది. పార్వతీపురం డివిజన్‌లో 36 రేషన్‌డీలర్‌ పోస్టులకు గతనెల 23న రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 202 మంది పరీక్ష రాశారు. వీరిలో పరీక్షలో ప్రతిభ కనబర్చిన వారిని ఇంటర్వ్యూకు పిలిచారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కొద్దిరోజుల క్రితం విడుదల చేశారు. ఈ జాబితాను చూసిన వారు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. 36 రేషన్‌ డీలర్‌ పోస్టులకు ఎంపిక చేసిన 36 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే ఎవరికైనా సూటిగా అర్ధమవుతుంది. కానీ అధికారులు మాత్రం హాల్‌ టికెట్ల నెంబర్లతో జాబితా విడుదల చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌ డీలర్‌ పోస్టుల భర్తీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సు మేరకే ఎంపిక చేశారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారులు ప్రకటించిన జాబితా చూసిన నూటికి నూరు శాతం ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. డీలర్‌ పోస్టులను రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామని అధికారులు ముందు గొప్పగా చెప్పారు. తీరా జాబితాను పరిశీలించిన తర్వాత ప్రతిభకు పాతరేశారనే ప్రచారం జరుగుతోంది. అధికారపార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులు పొందిన వారికే డీలర్‌ పోస్టులను కట్టబెట్టారనేది స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక నాయకుల సిఫార్సు మేరకు దండిగా ముడుపులు చెల్లించిన వారికే ఎమ్మెల్యేలు సిఫార్సు చేశారనేది స్పష్టమైంది. హాల్‌ టికెట్ల నెంబర్లతో జాబితా విడుదల చేసిన అధికారులు రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కులు, ప్రతిభా పాటవాలను జాబితాలో చూపించలేదు. ఎంపికైన అభ్యర్థుల పేర్లను గోప్యంగా ఉంచడం వెనుక జిల్లా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారనేది తేటతెల్లమైంది. గ్రామాల్లో ఒక్కో డీలర్‌ పోస్టుకు ఐదు నుంచి పది మంది వరకు పోటీ పడ్డారు. వీరిలో ఒక్కో గ్రామం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు వరకు స్థానిక నాయకుల ఒత్తిడి మేరకు ఎమ్మెల్యేలకు పేర్లు అందజేశారు. అయితే ఎమ్మెల్యేలు రాజకీయ పలుకుబడితో పాటు డబ్బులు ఎక్కువ ఇచ్చిన వారికే డీలర్‌ పోస్టులకు సిఫార్సు చేశారు. గ్రామాల్లో పార్టీ నాయకుల మధ్య అంతరాలు పెరిగిపోకుండా ఉండేందుకు ఎమ్మెల్యేల సూచన మేరకు అభ్యర్థుల పేర్లను జాబితాలో ప్రకటించలేదని తెలుస్తోంది. అధికారులు ప్రకటించిన జాబితాను పరిశీలించిన తర్వాత డీలర్‌ పోస్టుల భర్తీలో ప్రతిభకు పాతర వేశారనేది రుజువైంది.

➡️