ప్రజాశక్తి – ఆరిలోవ : ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలలో బుధవారం వన్యప్రాణి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ (పిసిసిఎఫ్) శ్రీకంఠనాధరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా నిర్వహిస్తున్న పోటీలకు వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, వన్యప్రాణి ప్రేమికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పిసిసిఎఫ్ శ్రీకంఠ నాధరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు, జంతు ప్రేమికుల్లో వన్యప్రాణుల పట్ల అవగాహన పెంచేందుకు కార్యక్రమాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జూ క్యూరేటర్ డాక్టర్ నందనీ సలారియా, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మంగమ్మ, జూ సిబ్బంది పాల్గొన్నారు.
