చెత్త పన్ను ఎత్తేస్తారా? ట్రూఆప్‌ ఛార్జీలు తీసేస్తారా?

Jun 10,2024 00:35

ప్రజాశక్తి-తాడేపల్లి : గతంలో ఎన్నడూ లేని విధంగా వైసిపి ప్రభుత్వం ఇళ్ల నుంచి సేకరించే చెత్తకు కూడా పన్ను వేసింది. ఈ విధానం ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పించింది. ఇంటి పన్ను వసూళ్లతో పాటు లైబ్రరీ సెస్‌, గ్రంథాలయం పన్ను, డ్రెయినేజీ పన్నుతో పాటు అన్ని కలిపి వసూలు చేసే పద్ధతి ఎప్పటి నుంచో ఉంది. కొత్తగా చెత్త పన్ను కట్టాల్సిందేనని వైసిపి ప్రభుత్వం జిఒ తెచ్చింది. కేంద్రంతో సఖ్యత కోసం బిజెపి పట్టణ సంస్కరణల్లో భాగంగా బలవంతంగా ప్రజల నుంచి చెత్త పన్ను వసూలుకు శ్రీకారం చుట్టారు. పన్ను చెల్లించని వారి ఇళ్లు, షాపులు ముందు వివిధ ప్రాంతాల్లో సేకరించిన చెత్తను తీసుకొచ్చి గుమ్మరించారు. ఇది ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. చెత్త పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించి ముందుకు వెళ్లింది. ఎన్నికలు జరిగే వరకు గత ప్రభుత్వం చెత్త పన్నును కొనసాగించింది. ట్రూఆప్‌ ఛార్జీల పేరుతో విద్యుత్‌ భారాలు మోపింది. దీనిపై కూడా ప్రజాగ్రహం పెల్లుబీకింది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం వినియోగించిన విద్యుత్‌కు బకాయి ఉందంటూ విద్యుత్‌ వినియోగదారుడు ఉపయోగించిన దానికంటే రెండు నుంచి మూడు రెట్లు ఛార్జీలు అదనంగా వసూలు చేశారు. ఇంధనం సర్‌ఛార్జీ, సర్దుబాటు, డిస్కమ్‌ ఛార్జీలంటూ ముద్దుపేర్లు పెట్టారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పటికీ వినియోగదారులు ఉపయోగించిన దాని కంటే అధికంగా బిల్లులు చెల్లిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. గత ఆరు రోజుల నుంచి వాట్సప్‌, సోషల్‌ మీడియాలో విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు, చెత్త పన్ను ఎత్తివేయడానికి రంగం సిద్ధం అంటూ పెద్దఎత్తున ప్రచారమవుతోంది. చెత్త పన్ను, విద్యుత్‌ సంస్కరణలు తెచ్చిన బిజెపితో ప్రస్తుత అధికారంలోకి రాబోతున్న ప్రభుత్వం జత కట్టింది. నిజంగా వీటిని టిడిపి ప్రభుత్వం ఎత్తివేస్తుందా? అనే ప్రశ్న వస్తోంది. చెత్త పన్ను, విద్యుత్‌ భారాలను సిపిఎం క్షత్రస్థాయిలో వ్యతిరేకించింది. చెత్త పన్ను కట్టవద్దని ప్రజల్ని చైతన్యపరిచింది. విద్యుత్‌ ఛార్జీల భారం ఏ విధంగా మోపుతున్నారో ప్రజలకు తెలియజెప్పింది. పట్టణ పౌర సంక్షేమ సంఘం, తదితర ప్రజా సంఘాలను కలుపుకుని ఉద్యమాలు నడిపింది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. సచివాలయాలు, మున్సిపల్‌ కార్యాలయాల ముందు చెత్త పన్ను ఎత్తివేయాలని ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన తెలిపినా ప్రభుత్వం మొండిగా ప్రజల నుంచి చెత్త పన్ను, ట్రూఅప్‌ ఛార్జీలు వసూలు చేసింది. తాజా రాష్ట్రంలో ఏర్పడే కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

➡️