– వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపైనే ఆశలు- కెపి ఉల్లి, పసుపు శాశ్వత కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి- అభివద్ధికి ఆమడ దూరంలో మున్సిపాలిటీ- ప్రధాన సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించేనా!ప్రజాశక్తి – చాపాడు (మైదుకూరు) మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పరిధిలో ఉన్న ప్రజలు అధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంత వ్యవసాయానికి జీవనాధారమైన కెసి కెనాల్, బ్రహ్మసాగర్లకు నీటి వాటాకు ప్రతి ఏడాది రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వాలు పునాదులు వేసిన అది ఆచరణలో అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత అధికార ప్రభుత్వం కూడా రాజోలి ఆనకట్ట, బ్రహ్మ సాగర్ స్థిరీకరణ చేపట్టి తీరుతామని హామీ ఇచ్చింది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం మైదుకూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాశక్తి నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక కథనం…చిరకాల స్వప్నం రాజోలి ఆనకట్ట… రాజోలి ఆనకట్ట పెంపు ప్రాజెక్ట్‌పై నిర్లక్ష్యం కొనసాగుతుంది. ఏళ్ళు గడుస్తున్న నిర్మాణం ముందుకు సాగడం లేదు. జిల్లాలోని లక్షలాది మంది రైతుల గుండె సవ్వడి ప్రవాహమే కెసి కెనాల్, ఈ ప్రాంత రైతుల కుటుంబాలకు బతుకు తెరువు కెసి కెనాల్ రైతుల పాలిట కల్పతరువు. జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తున్న ఒక పెద్ద ప్రాజెక్టు. రాజోలి ఆనకట్ట, కెసి కాలువ ద్వారా జిల్లాలోని రాజుపాలెం, దువ్వూరు, ప్రొద్దుటూరు, చాపాడు, మైదుకూరు, ఖాజీపేట, వల్లూరు, చెన్నూరు, కడప మండలాల్లో 92 వేల ఎకరాలలో సాగు భూమి ఉంది. ప్రస్తుతం వరి, పసుపు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మినుము ఇతర పంటలను దేశానికి ఎగుమతి చేసే దిశగా కెసి కెనాల్ ప్రాంత రైతులు ఉన్నారు. కెసి కెనాల్‌కు ప్రతి సంవత్సరం నీరు వస్తుందా లేదా అని సందిగ్ధంలో రైతులు ఉంటున్నారు. రాజోలి ఆనకట్టను 2.95 టిఎంసిల సామర్థ్యంతో సుమారుగా రూ.800 కోట్లకుపైగా నిధులు వెచ్చించి నిర్మించే ప్రాజెక్టు పెండింగ్‌లో ఉండిపోయింది. వేసవిలోనైనా రాజోలి ఆనకట్ట సామర్థ్యం పెంపు పనులు ప్రారంభిస్తారా లేదా అన్న సందిగ్ధాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో కుందూ వరద నీరు పెన్నా గుండా సోమశిల ప్రాజెక్టులోకి ప్రతి ఏడాది లక్షల క్యూసెక్కుల నీరు తరలివెళ్తుంది. అధికారుల నివేదిక ప్రకారం ప్రతి ఏడాదీ 50 నుంచి 70 టిఎంసిల నీరు సోమశిలకు చేరుతుంది. రాజోలు ఆనకట్ట పెంపుదల చేస్తే ఈ నీటిని నిల్వ ఉంచి కెసి కెనాల్‌కు మళ్లించడం ద్వారా రైతులు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వచ్చే నీరు ఆలస్యమైనప్పటికీ సకాలంలో పంటలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కొన్ని సందర్భాలలో చర్చించడం తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు విడుదల కాలేదు.ఆయకట్టు స్థిరీకరణ మైదుకూరు మండలంలో 30 నుండి 40 శాతం చెరువులు, తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టు, పిల్లకాలవలు, అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు సాగు, తాగు నీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గత ముఖ్యమంత్రులు ఎన్‌టి రామారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మైదుకూరు నియోజకవర్గ రైతులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా దువ్వూరు మండలం చల్లబసాయిపల్లె గ్రామ ప్రాంతంలో ఎస్‌ఆర్-1, మైదుకూరు మండలం గంజికుంట ప్రాంతంలో 2, బ్రహ్మంగారిమఠం పరిధిలో ఉన్న బ్రహ్మసాగర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. నియోజకవర్గంలోని 4 మండలాల రైతులకు ఉపయోగ పడే విధంగా పంట పిల్ల కాలువలను తవ్వితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.వ్యవసాయ పరిశ్రమల కోసం ఎదురుచూపు మైదుకూరులో నాఫెడ్ సంస్థకు భూమి కేటాయింపు, వనిపెంట రెవెన్యూ గ్రామ పరిధిలో ఉల్లి పరిశోధన కేంద్రం (ఎన్‌హెచ్‌ఆర్‌డిఎఫ్)కు భూమి కేటాయింపు విషయం గురించి గతంలో పలుధపాలు రైతులు వినతి పత్రాలు అందజేశారు. రాయలసీమకు విదేశీ మారక ద్రవ్యం తీసుకువచ్చే అతి పెద్ద పంట కెపి ఉల్లి. వీటిని విదేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుండటంతో అమ్మకానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. స్థానికంగా అమ్మకం చేయాలంటే దళారులు నిర్ణయించినదే ధర. మైదుకూరు కేంద్రంగా జిల్లాలోని దువ్వూరు, బి.మఠం మండలాలతో పాటు కర్నూలు జిల్లాలో సాగయ్యే ఉల్లికి శాశ్వత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కొంతకాలం నుంచి పసుపు సాగుకు రైతులు అనాశక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సిఎసిపి వారు పసుపు పంటకు కనీస మద్దతు, గిట్టుబాటు ధర నిర్ణయించడం లేదు. జిల్లాలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో పసుపు పంటకు మార్కెట్ సౌకర్యం ఉంది. మన రాష్ట్రంలో మన జిల్లాతో పాటు దుగ్గిరాల మార్కెట్ యార్డులో నిర్వహిస్తారు. ధరల నిర్ణయం పూర్తిగా వ్యాపారస్తులదే. పసుపు గ్రేడింగ్ అధికారులు మాత్రం నామమాత్రంగా అందుబాటులో ఉంటున్నారు. సరైన గిట్టుబాటు ధరలు వచ్చేంతవరకు నిల్వ ఉంచుకునేందుకు నిల్వ సౌకర్యం అందుబాటులో లేదు. కూరగాయల సాగును అధికంగా రైతులు చేపడుతున్నారు వీటి అమ్మకాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శీతల గిడ్డంగులను ఏర్పాటు చేస్తే పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. వెంటాడుతున్న డ్రెయినేజీ, సిమెంట్ రోడ్ల సమస్య నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలలో డ్రెయినేజీ, సిమెంట్ రోడ్ల సమస్య వెంటాడుతుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేయడంలో కొంతవరకు సఫలమైంది. ముఖ్యంగా మున్సిపాల్టీ ఏర్పడినప్పటి నుంచి డ్రెయినేజీ సమస్య అధికంగా కనిపిస్తుంది. పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు. మైదుకూరు చెరువుకు సంబంధించిన కాలువ పూర్తిగా ఆక్రమణకు గురైంది. దీంతో మోస్తరు పడితే నీరు రోడ్డు పైకి చేరుతుంది. 24 వార్డులలో ఎక్కడ చూసినా సిమెంటు రోడ్లు వేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. పట్టణంలో బద్వేల్ రోడ్డు, కడప రోడ్డు తక్కువ కాలంలో అభివద్ధి చెందుతూ ఎక్కువ గహాలు నిర్మిస్తున్నారు. అయినప్పటికీ ఈ కాలనీలను అభివద్ధి పరచడంలో మాత్రం పాలకులు అధికారులు వెనుకంజలో ఉన్నారు.పాడి పరిశ్రమకు ప్రోత్సాహం కరువు మైదుకూరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాల సేకరణ కేంద్రాలు కరువయ్యాయి. ప్రయివేట్ పాల కేంద్రాల నుంచి రైతులకు ఎలాంటి లబ్ధి అందడం లేదు. పాడి రైతులకు ఖర్చులు పెరగడంతో ప్రభుత్వం పల్లెల్లో పాల ఉత్పత్తి ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిలో పేరుగాంచిన చాపాడు మండలం ప్రస్తుతం పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గతంలో పాడి పశువులను కొనుగోలు నిర్వహణకు ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వాలు అందించేది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి పరిశ్రమ కు ఎలాంటి ఆదరణ కనిపించడం లేదు. పాడి రైతుల కంటే పాల సేకరణ చేసే వారికే లాభాలు అధికంగా ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో ఒక రోజుకు లక్ష లీటర్ల వరకు పాల సేకరిస్తున్నారు. పశువుల దాన, గడ్డి రేట్లు విపరీతంగా పెరగడంతో పశువుల పోషణ భారం అధికమై, పాడి రైతుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది. నియోజకవర్గంలో ఈ ప్రధాన సమస్యలతో పాటు రోడ్లు, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు , పశు వైద్యం మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఫోటో రాజోలి ఆనకట్ట.మైదుకూరు లో అభివద్ధికి నోచుకోని డ్రైనేజి కాలువలు.పసుపు పంట.
