ప్రజాశక్తి- కడప అర్బన్ శిక్షణల పేరుతో ఉపాధ్యాయుల ప్రాణాలను బలిగొంటారా అని రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల తీరుపై యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ కుమార్, పాలెం మహేష్ బాబు ప్రశ్నించారు. . లీడర్షిప్ రెసిడె న్షియల్ శిక్షణా తరగతులలో ఇద్దరు ప్రధానో పాధ్యాయులు మరణించడం పట్ల, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, విద్యాశాఖ అధికారుల తీరును నిరసిస్తూ యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం డిఇఒ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లీడర్షిప్ ట్రైనింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశా ఖాధికారులు ఉపాధ్యాయులకు రెసిడెన్షియల్ శిక్షణలను ఏర్పాటుచేసి తీవ్ర ఒత్తిడిలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వేసవి సెలవులలో ఇవ్వాల్సిన శిక్షణలను విద్యా సంవత్సరం మధ్యలో ఏర్పాటు చేయడమే కాకుండా ఉపాధ్యాయులు కచ్చితంగా రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ పొందాలని అడ్డగోలు నిబంధనలను విధించి వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రెసిడెన్షియల్ శిక్షణ కేంద్రాలలో సరైన వసతులను ప్రభుత్వం కల్పించడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. శిక్షణా కేంద్రాలలో సరైన సౌకర్యాలు లేక, అనారోగ్యాలతో ఉన్న ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల వైఖరి వల్ల ఉపాధ్యాయులు తమ ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మొదటి విడత శిక్షణలో భాగంగా ఏలూరు జిల్లాలోని అగిరిపల్లె శిక్షణా కేంద్రంలో టి.వి.రత్న కుమార్ అనే ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మరణించగా, రెండవ విడత శిక్షణలో భాగంగా విజ యనగరం జిల్లా, గజపతినగరంలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులలో ఈరోజు సిరిపురం శ్రీనివా సరావు అనే మరో ప్రధానోపాధ్యాయుడు ఒత్తిడికి లోనై గుండెపోటుతో మరణించాడని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల మరణానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందో, విద్యాశాఖ అధికారులు బాధ్యత వహిస్తారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మతి చెందిన ప్రధానోపాధ్యాయులకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. రెసిడెన్షియల్ శిక్షణను తక్షణమే రద్దు చేయకపోతే పోరుబాట పట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ట్రెజరర్ నరసింహారావు, జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ, ఎస్.ఏజాస్ అహ్మద్, నాయకులు సుబ్బారావు, వీరనారాయణ, శివకుమార్ రాజు, సూర్య కుమార్, గోపినాథ్, సుబ్బారెడ్డి, రామ కేశవ, హిపాజత్తుల్లా, అబ్దుల్ ఘని, శివశంకర్ పాల్గొన్నారు.