ఈ ఏడాదైనా శుద్ధ జలాలు అందేనా?

Jun 9,2024 21:35

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ : మున్సిపాలిటీ పరిధిలో గల పట్టణ ప్రజలకు గత 15ఏళ్లుగా వర్షాకాలంలో కుళాయిల ద్వారా ప్రతి ఏటా బురద నీరు సరఫరా జరుగుతోంది. ఈ నీటినే వాడుకొనే పరిస్థితి పట్టణ ప్రజలకు తప్పడం లేదు. ఈ వర్షాకాలంలోనైనా శుద్ధ జలాలు సరఫరా జరిగేనా, బురద నీరు సరఫరా తప్పదా అని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటీవల విజయవాడ నగరంలో కుళాయిల ద్వారా జరిగిన కలుషితనీరు తాగి కొందరు మరణించారు. అలాంటి సంఘటన పార్వతీపురంలో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్‌ అధికారులపై ఉంది. ఈ బురద నీటి సమస్య పరిష్కారానికి మున్సిపల్‌ అధికారులు ప్రతి ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనబడలేదని చెప్పవచ్చు. ఈ ఏడాది మరికొన్ని రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్న దృష్ట్యా కుళాయిల ద్వారా బురద నీరు సరఫరా జరిగే అవకాశం ఉంటుదని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గం నుంచి కొత్తగా గెలిచిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపి మున్సిపల్‌ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, పట్టణంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలైన డంపింగ్‌ యార్డ్‌ తరలింపు సమస్యతో పాటు, రానున్న వర్షాకాలంలో బురద నీరు సరఫరా జరగకుండా ప్రణాళికలు రూపొందించాల్సిన బాధ్యత, చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

➡️