ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం ను గెలిపించండి : మూలం. రమేష్‌

నెల్లూరు : నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 54వ డివిజన్‌ జనార్దన్‌ రెడ్డి కాలనీలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం.రమేష్‌ శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలను కలుస్తూ … రానున్న ఎన్నికల్లో సిపిఎం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … దేశంలో మత విద్వేషాలని రెచ్చగొడుతూ, రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపితో ప్రత్యక్షంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు, పరోక్షంగా వైసిపి పార్టీలు అంటకాగుతున్నాయని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలలో అభద్రతాభావం నెలకొందని జనార్దన్‌ రెడ్డి కాలనీలో పర్యటించే సందర్భంలో ప్రతి ఒక్కరు వారి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. బిజెపి విద్వేష రాజకీయాలకు స్వస్తి పలకాలంటే రానున్న ఎన్నికల్లో వామపక్ష, కాంగ్రెస్‌ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ …. స్థానిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సిపిఎం పార్టీ అనేక పోరాటాలు నిర్వహించిందని అన్నారు. మంచినీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, దోమల సమస్యల కోసం పనిచేశామన్నారు. జనార్దన్‌ రెడ్డి కాలనీ పెన్నా నదిలో ఉన్నప్పటికీ మంచినీటి సమస్య తీవ్రంగా ఉండడం పాలకుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం అని అన్నారు. ప్రజల మధ్య తిరుగుతూ పనిచేసే సిపిఎం పార్టీని రానున్న ఎన్నికల్లో అధిక మెజారిటీతో ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నగర కమిటీ సభ్యులు బీపీ నరసింహ, కత్తి పద్మ, శాఖా కార్యదర్శులు షేక్‌ జాఫర్‌, నక్క వెంకటేశ్వర్లు, మల్లీశ్వరి, స్థానిక నాయకులు ఎస్‌.కె.ఎం బాబు, అల్లాబక్షు, ఆనంద్‌, శంకరయ్య, రామ్మోహన్‌, శ్రీకాంత్‌, కత్తి చిన్న, తదితరులు పాల్గొన్నారు.

➡️